Smoking: పొగ‌తాగే వారికే కాదు.. పీల్చే వారికి కూడా ప్ర‌మాద‌మే. 44 కోట్ల మందిపై ప్ర‌భావం!

Smoking: సిగరెట్ తాగే వ్యక్తికే కాదు.. అతని చుట్టూ ఉండే వారికి కూడా పొగతో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Mokshith
Published on: 24 Sept 2026 5:03 PM IST
Smoking
X

Smoking: పొగ‌తాగే వారికే కాదు.. పీల్చే వారికి కూడా ప్ర‌మాద‌మే. 44 కోట్ల మందిపై ప్ర‌భావం!

Smoking: సిగరెట్ తాగే వ్యక్తికే కాదు.. అతని చుట్టూ ఉండే వారికి కూడా పొగతో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తాజాగా ఓ అధ్యయనం ప్రకారం, 2023లో భారత్‌లో సుమారు 44.4 కోట్ల మంది సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కు గురయ్యారు. అంటే వీరు స్వయంగా ధూమపానం చేయకపోయినా.. ఇతరులు వదిలిన పొగను పీల్చాల్సి వచ్చింది.

భారత్‌లో 44 కోట్ల మందికి పైగా పొగ ప్రభావం

కొత్త పరిశోధన ప్రకారం 2023లో భారత్‌లో దాదాపు 44.4 కోట్ల మంది సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కు గురయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య సుమారు 271 కోట్లుగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. భారత్‌తో పాటు చైనా, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇతరుల పొగకు గురవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఇంట్లో కుటుంబ సభ్యులు ధూమపానం చేయడం, కార్యాలయాలు లేదా ఇతర ప్రదేశాల్లో పొగతాగే వ్యక్తుల దగ్గర ఉండటం వల్ల కూడా సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. పొగలోని హానికరమైన పదార్థాలు గాలి ద్వారా చుట్టుపక్కల వారికి చేరుతాయి. అందుకే ధూమపానం చేయని వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

3 లక్షలకు పైగా మరణాలతో సంబంధం

సెకండ్‌హ్యాండ్ స్మోక్‌ ప్రభావం కేవలం అసౌకర్యం కలిగించడంతో ఆగిపోదు. దీర్ఘకాలం పాటు పొగకు గురికావడం వల్ల పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అధ్యయనం ప్రకారం, 2023లో భారత్‌లో 3 లక్షలకు పైగా మరణాలు సెకండ్‌హ్యాండ్ స్మోక్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు అంచనా వేశారు.

అంతేకాదు, 90 లక్షలకు పైగా ఆరోగ్యకరమైన జీవన సంవత్సరాలు కూడా ప్రభావితమైనట్లు పరిశోధనలో పేర్కొన్నారు. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లు, ఆస్తమా, టైప్‌-2 డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలతో సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కు సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో 1990 నుంచి 2023 వరకు 204 దేశాలు, ప్రాంతాలకు సంబంధించిన డేటాను పరిశీలించారు.

పిల్లలు, మహిళలపై ఎక్కువ ప్రభావం

సెకండ్‌హ్యాండ్ స్మోక్ వల్ల పిల్లలు ప్రత్యేకంగా ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. చిన్న వయసులో ఊపిరితిత్తులు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల పొగలోని హానికరమైన పదార్థాలు వారి ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపవచ్చు. దీంతో శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది.

పరిశోధనలో మరో ఆసక్తికరమైన విషయం కూడా వెల్లడైంది. దక్షిణ-తూర్పు ఆసియా, తూర్పు ఆసియా, ఓషియానియా ప్రాంతాల్లో పురుషులతో పోలిస్తే మహిళలు సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కు గురయ్యే అవకాశం 59 శాతం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కు గురయ్యే జనాభా శాతం తగ్గినప్పటికీ, మొత్తం జనాభా పెరగడంతో ప్రభావితమవుతున్న వారి సంఖ్య మాత్రం భారీగానే ఉంది.

ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకోవాలి

పాసివ్ స్మోకింగ్‌ నుంచి రక్షించుకోవాలంటే ఇంట్లో, కార్యాలయంలో, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానానికి దూరంగా ఉండటం ముఖ్యం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు పొగకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఎవరైనా ధూమపానం చేస్తే ఇతర కుటుంబ సభ్యులు కూడా పొగను పీల్చాల్సి వస్తుంది.

అందువల్ల సొంత ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ధూమపానాన్ని నివారించడం అవసరం. సిగరెట్ తాగకపోవడం మాత్రమే కాదు.. ఇతరులు వదిలే పొగకు దూరంగా ఉండటం కూడా ఆరోగ్యానికి ముఖ్యమే.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.