Sravana Masam: శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదం ఇదే.. పాయసం ఇలా చేస్తే..!
Sravana Masam Prasadam: శ్రావణ మాసంలో దేవతలకు నైవేద్యంగా సమర్పించేందుకు ఈ పాయసం అద్భుతమైన ఎంపిక. రుచితో పాటు ఆరోగ్యకరమైన ఈ తీపి వంటకాన్ని ఈ పండుగ రోజుల్లో మీరు కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసి అమ్మవారి అనుగ్రహం పొందండి.
Sravana Masam: శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదం ఇదే.. పాయసం ఇలా చేస్తే..!
Sravana Masam Prasadam: శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఇళ్లన్నీ ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతుంటాయి. లక్ష్మీదేవికి పూజలు చేస్తూ రకరకాల ప్రసాదాలు నివేదిస్తుంటారు. ఈ పవిత్ర మాసంలో ఎప్పుడూ చేసే పాయసాలు కాకుండా నోరూరించే ప్రత్యేకమైన గుమ్మడికాయ పెసరపప్పు పాయసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..!
పండుగలు వచ్చినప్పుడు సాధారణంగా పరమాన్నం, సేమియా లేదా శనగపప్పు పాయసం తయారు చేస్తుంటాం. ఈసారి లక్ష్మీదేవి పూజకు, వరలక్ష్మి వ్రతానికి వెరైటీగా ఉండే గుమ్మడికాయ పెసరపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమైనది కావడం విశేషం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా ఆస్వాదించే తీపి వంటకం ఇది.
కావలసిన పదార్థాలు..
ఈ పాయసానికి ఒక కప్పు పెసరపప్పు, కప్పున్నర తియ్యటి గుమ్మడికాయ ముక్కలు, కప్పున్నర బెల్లం తురుము, తగినంత నెయ్యి, జీడిపప్పు, పాలు, యాలకుల పొడి అవసరమవుతాయి. ముందుగా పెసరపప్పును శుభ్రమైన తడిగుడ్డతో తుడిచి ఆరబెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పును గోల్డెన్ కలర్‌లో వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో పెసరపప్పును దోరగా, మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
కుక్కర్‌లో సులువైన వంట విధానం..
దోరగా వేగిన పెసరపప్పును కుక్కర్‌లో వేయాలి. అనంతరం అదే కడాయిలో మరికాస్త నెయ్యి వేసి గుమ్మడికాయ ముక్కలను వేయించాలి. నేతి వాసన పట్టేలా వేగిన గుమ్మడి ముక్కలను కూడా కుక్కర్‌లోని పప్పుతో పాటు కలపాలి. ఇందులోనే ఒక చిన్న గ్లాసు పాలు పోసి, కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పాలు పోసినప్పుడు వెంటనే విజిల్ పెట్టకుండా కాసేపు ఆవిరి రానిచ్చి వెయిట్ పెట్టడం మంచిది.
బెల్లం పాకం, అమృతతుల్యమైన పాయసం..
మరోవైపు ఒక పాత్రలో బెల్లం తురుము, అర గ్లాసు నీళ్లు పోసి కరిగించుకోవాలి. పాకం తీగలా రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగి గులాబ్ జామూన్ పాకంలా పల్చగా ఉంటే సరిపోతుంది. కుక్కర్ చల్లారాక ఉడికిన పప్పు, గుమ్మడికాయ మిశ్రమాన్ని గరిటెతో బాగా ఎనిపేయాలి. ఇందులో కరిగించిన బెల్లం నీటిని వడకట్టి పోయాలి. చివరగా యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు పలుకులు కలిపితే కమ్మటి గుమ్మడికాయ పెసరపప్పు పాయసం సిద్ధమవుతుంది. పాలు పోసి ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు.




