Late Night Sleep: అర్ధరాత్రి దాటాక మేలుకుంటున్నారా?.. అయితే క్యాన్సర్ ముప్పు తప్పదా
Late Night Sleep: ప్రస్తుత ఆధునిక జీవనశైలి కారణంగా రాత్రిపూట చాలా మంది అర్ధరాత్రి దాటే వరకు మొబైల్స్ లేదా లాప్‌టాప్‌లతో గడుపుతున్నారు.
Late Night Sleep
Late Night Sleep: ప్రస్తుత ఆధునిక జీవనశైలి కారణంగా రాత్రిపూట చాలా మంది అర్ధరాత్రి దాటే వరకు మొబైల్స్ లేదా లాప్‌టాప్‌లతో గడుపుతున్నారు. ఇలా అర్ధరాత్రి దాటాక మేలుకుని ఉండే అలవాటు మన శరీరంలోని బయలాజికల్ క్లాక్ పూర్తిగా తలకిందులు చేస్తుంది. నిద్రపోయే వేళల్లో మార్పులు రావడం వల్ల శరీరంలోని ముఖ్యమైన విధులకు ఆటంకం కలుగుతుంది. నిద్ర లేమి సమస్య రోగనిరోధక శక్తి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శరీరం తనను తాను రిపేర్ చేసుకునే సమయం కోల్పోవడంతో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీర రక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం
మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరం తనను తాను నయం చేసుకుంటుంది. అలాగే మన రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేసి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. నిద్ర వేళల్లో నిరంతరం మార్పులు జరగడం లేదా తగినంత నిద్ర లభించకపోవడం వల్ల శరీర సహజ రక్షణ వ్యవస్థ బలహీనపడుతుంది. నిద్ర లేకపోవడం వల్ల మెదడుతో పాటు గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, సకాలంలో మేల్కొనడం వల్ల శరీరంలోని జీవక్రియలు సక్రమంగా పనిచేస్తాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన జీవితం సొంతమవుతుంది.
క్యాన్సర్‌తో సంబంధం ఉందా?
ఇటీవల వెలువడిన కొన్ని పరిశోధనల ప్రకారం రాత్రి ఆలస్యంగా పడుకోవడం, నైట్ షిఫ్ట్లలో పనిచేయడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు నిద్రలేమికి మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే అర్ధరాత్రి నిద్రపోవడం వల్ల నేరుగా క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి ఇప్పటివరకు కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ ఇది శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సమతుల్య నిద్రతోనే సంపూర్ణ ఆరోగ్యం
శరీర దారుఢ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి రోజు క్రమపద్ధతిలో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, ఉదయం సకాలంలో లేవడం వల్ల శరీర బయోలాజికల్ క్లాక్ నియంత్రణలో ఉంటుంది. నాణ్యమైన నిద్ర శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ప్రమాదకర వ్యాధుల నుంచి సులభంగా రక్షణ పొందవచ్చు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి సరైన నిద్ర అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో శ్రేయస్కరం.




