వర్షాకాలంలో ఇంట్లోకి పాములు రాకూడదంటే.. ఇవి కచ్చితంగా పాటించండి

Snakes Prevention: వానాకాలంలో వర్షాల కారణంగా పాములు, విష కీటకాల బెడద విపరీతంగా ఉంటుంది.

Ravi
By Ravi
Published on: 21 Jun 2026 1:36 PM IST
Snakes Prevention
X

వర్షాకాలంలో ఇంట్లోకి పాములు రాకూడదంటే.. ఇవి కచ్చితంగా పాటించండి

Snakes Prevention: వానాకాలం రాగానే పచ్చదనంతో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా విష జంతువుల బెడద కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ సీజన్‌లో ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాల కారణంగా నేల లోపల, బొరియల్లో ఉండే పాములు, తేళ్లు ఇతర విష కీటకాలు బయటకు వస్తుంటాయి. ఇలా ఆశ్రయం కోల్పోయి బయటకు వచ్చిన ఆ సరీసృపాలు తమకు వెచ్చని ప్రదేశం కోసం లేదా ఆహారం కోసం వెతుక్కుంటూ ఇళ్లలోకి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఇంటి పరిసరాలు, ఆవరణ శుభ్రంగా లేకపోతే, అవే ఆ విష కీటకాలకు సురక్షితమైన నివాసాలుగా మారిపోతాయని స్నేక్ రెస్క్యూవర్స్ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. కాబట్టి వానాకాలంలో పాములు, ఇతర ప్రమాదకరమైన కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

స్నేక్ రెస్క్యూవర్స్ చెబుతున్న సూచనల ప్రకారం.. ముందుగా ఇంటి చుట్టుపక్కల ఎలాంటి చెత్తాచెదారం లేకుండా ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ఆవరణలో పెద్దపెద్ద పొదలు, పిచ్చి లేదా కలుపు మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు వాటిని కత్తిరించి శుభ్రం చేయాలి. సాధారణంగా పాములు తమ ప్రధాన ఆహారమైన కప్పలు, ఎలుకలను వెతుక్కుంటూనే జనావాసాల్లోకి వస్తుంటాయి. కాబట్టి, ఇంట్లో లేదా ఇంటి పరిసరాల్లో ఎలుకలు లేకుండా వాటి నియంత్రణకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలి. అలాగే, ఇంటి గోడలకు ఏవైనా పగుళ్లు, డ్రైనేజీ పైపుల వద్ద ఖాళీలు లేదా రంధ్రాలు ఉంటే వాటి ద్వారా పాములు అత్యంత సులభంగా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలం మొదట్లోనే అలాంటి రంధ్రాలను సిమెంట్ లేదా కంకరతో వెంటనే పూర్తిగా మూసేయాలి.

వీటితో పాటు మరికొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు కూడా తప్పనిసరి. వర్షం పడుతున్నప్పుడు లేదా రాత్రి సమయాల్లో ఇంటి బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా చెప్పులు లేదా బూట్లు వేసుకునే బయట అడుగుపెట్టాలి. చీకట్లో నడిచేటప్పుడు చేతిలో టార్చ్ లైట్ ఉంచుకోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా పల్లెటూర్లలో వంట కోసం ఎక్కువగా వంట చెరకు వాడుతుంటారు. ఆ వంట కర్రల కుప్పలు, అలాగే వ్యవసాయం ద్వారా వచ్చిన ధాన్యం బస్తాలు, పాత వస్తువులను నేరుగా భూమి మీద కాకుండా, నేల నుంచి కనీసం ఒక అడుగు ఎత్తుగా ఉండేలా స్టాండ్లపై లేదా బల్లలపై అమర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నేలపై ఉంచే కర్రల కుప్పల కింద పాములు సులభంగా దాక్కునే ప్రమాదం ఉంటుంది కాబట్టే ఈ జాగ్రత్త అవసరం. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వానాకాలంలో పాములు, విష కీటకాల భయం లేకుండా సురక్షితంగా ఉండవచ్చు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story