Betel Leaf: వాతావరణం మారితే ఈ ఆకులతో ఆరోగ్యానికి మేలు.. తమలపాకుల ప్రయోజనాలు ఇవే

Betel Leaf: భారతదేశంలో పాన్‌కు ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బనారసి పాన్ అంటే ఇష్టపడని వారు ఉండరు.

CR Reddy
Published on: 14 Oct 2026 9:17 AM IST
Betel Leaf
X

Betel Leaf

Betel Leaf: భారతదేశంలో పాన్‌కు ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బనారసి పాన్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే పాన్ కేవలం నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. ప్రస్తుతం కాలంలో వాతావరణం వేగంగా మారుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి పెరుగుతుండగా, మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటోంది. ఈ మారుతున్న వాతావరణం వల్ల చాలా మందిలో కఫం, జలుబు, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమయంలో మన పూర్వీకులు, అంటే అమ్మమ్మలు, నాయనమ్మలు ఉపయోగించిన కొన్ని పాత కాలపు చిట్కాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి.

గొంతు గరగర, దగ్గు నుంచి తక్షణ ఉపశమనం

మారుతున్న కాలంలో గొంతులో గరగర, దగ్గు రావడం చాలా సాధారణమైన సమస్య. దీని నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఒక సులభమైన దేశీ చిట్కా ఉంది. ఒక తాజా పాన్ ఆకు తీసుకుని అందులో మూడు లేదా నాలుగు మిరియాలు, ఒకటి రెండుతులసి ఆకులు, కొద్దిగా కండశర్కర (పటికబెల్లం) వేసి బాగా నమిలి తింటూ దాని రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల గొంతు శుభ్రపడుతుంది. గరకర తగ్గి దగ్గు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరిచే అద్భుతమైన ఔషధం

వాతావరణ మార్పుల వల్ల చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. దీనికోసం పాన్ ఆకులను చక్కగా ఉపయోగించుకోవచ్చు. రెండు మూడు పాన్ ఆకులను చిన్న ముక్కలుగా చేసి మట్టి పాత్రలో వేయాలి. అందులో ఒక గ్లాసు నీరు పోసి కొద్దిగా వాము కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. గ్యాస్ సమస్య, కడుపులో బరువుగా అనిపించడం లేదా అజీర్తితో బాధపడేవారు ఈ కషాయాన్ని రోజూ కొద్ది కొద్దిగా తాగవచ్చు. చిన్నపిల్లలకైతే కేవలం ఒక స్పూన్ ఇవ్వవచ్చు.

కీళ్ల నొప్పులు, వాపులకు చెక్

చలికాలం ప్రారంభమయ్యే సమయంలో వాతావరణం చల్లబడటంతో కీళ్ల నొప్పులు, వాపులతో ఇబ్బంది పడేవారు ఎక్కువవుతారు. దీనికి చక్కటి పరిష్కారంగా పాన్ ఆకును వాడవచ్చు. కొద్దిగా ఆవ నూనెను పాన్ ఆకుపై రాసి, దానిని గోరువెచ్చగా చేసి నొప్పులు ఉన్న చోట కట్టులా కట్టాలి. కావాలనుకుంటే ఆ ఆకుపై చిటికెడు పసుపు కూడా అద్దుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభించి ఎంతో హాయిగా ఉంటుంది.

ఛాతీలో కఫం పేరుకుపోతే ఈ చిట్కా ట్రై చేయండి

చిన్న పిల్లలు లేదా పెద్దల ఛాతీలో కఫం పేరుకుపోయి ఇబ్బంది పడుతుంటే పెద్దలు తరచుగా ఈ పద్ధతిని పాటిస్తారు. పాన్ ఆకుపై ఆవనూనె రాసి కొద్దిగా వేడి చేయాలి. ఆ తర్వాత దానిపై కొద్దిగా తేనె రాసి ఛాతీకి కాస్త గోరువెచ్చగా ఉండేలా అంటించాలి. అయితే ఇది వేడిగా ఉండకుండా కేవలం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి, లేదంటే సున్నితమైన చర్మానికి ఇబ్బంది కలుగుతుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.