Health Tips: 'టైప్-2 డయాబెటిస్' ముప్పు ఉందా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాల్సిందే!
మధుమేహం బారిన పడటానికి ముందు మన శరీరంలో కొన్ని ప్రత్యేకమైన హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. టైప్-2 డయాబెటిస్ ప్రారంభ దశలో ఏయే లక్షణాలు బయటపడతాయో వైద్యులు వెల్లడించిన ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
Health Tips: 'టైప్-2 డయాబెటిస్' ముప్పు ఉందా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాల్సిందే!
Health Tips: ప్రస్తుత కాలంలో మధుమేహం లేదా డయాబెటిస్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యగా మారుతోంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ విపరీతంగా పెరుగుతోంది. ఈ వ్యాధి పూర్తిగా ముమ్మరం కాకముందు, అంటే ప్రారంభ దశలో ఉన్నప్పుడే శరీరం కొన్ని ప్రత్యేకమైన సంకేతాల ద్వారా మనల్ని అప్రమత్తం చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ప్రారంభ లక్షణాలను సరైన సమయంలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను చాలా వరకు నివారించవచ్చు.
టైప్-2 డయాబెటిస్ ప్రారంభంలో శరీరంలో అనేక రకాల మార్పులు, లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా తరచూ మూత్ర విసర్జనకు వెళ్లవలసి రావడం, ఎంత నీరు తాగినా విపరీతంగా దాహం వేయడం వంటివి దీనికి ప్రధాన సంకేతాలుగా ఉంటాయి. అలాగే త్వర త్వరగా ఆకలి వేయడం, ఎప్పుడూ ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా విపరీతమైన అలసటగా, నిరసంగా అనిపించడం జరుగుతుంది. వీటితో పాటు చూపు మసకబారడం, శరీరంలో ఎక్కడైనా గాయాలు అయితే అవి చాలా ఆలస్యంగా మానడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
కాగా, ఈ సాధారణ లక్షణాలతో పాటు కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు రావడం, మెడ, చంక, గజ్జల ప్రాంతాలలో చర్మం రంగు మారి నల్ల మచ్చలు ఏర్పడటం కూడా గమనించవచ్చు. అంతేకాకుండా నోటిలో లేదా ప్రైవేట్ పార్ట్స్ వద్ద తరచూ ఇన్‌ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి సంకేతాలు ఏవైనా మీలో కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.




