Viral Infections: వైరల్ ఇన్ఫెక్షన్‌తో పార్కిన్సన్స్ రిస్క్.. సీసీఎంబీ షాకింగ్ స్టడీ!
Viral Infections: వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని హైదరాబాద్ సీసీఎంబీ (CCMB) అధ్యయనం వెల్లడించింది.
Viral Infections: వైరల్ ఇన్ఫెక్షన్‌తో పార్కిన్సన్స్ రిస్క్.. సీసీఎంబీ షాకింగ్ స్టడీ!
Parkinson's Disease: వైరల్ ఇన్ఫెక్షన్లు శరీరంలో తీసుకొచ్చే అణు స్థాయి (Molecular) మార్పులు పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన నరాల క్షీణత వ్యాధులకు (Neurodegenerative Diseases) ఎలా దారితీస్తాయో హైదరాబాద్‌లోని 'సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ' (CSIR-CCMB) శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా నరాల క్షీణత వ్యాధులతో బాధపడేవారి మెదడులో ప్రోటీన్లు ఒకచోట చేరి 'అమైలాయిడ్' (Amyloid) అనే అసాధారణ గడ్డలుగా ఏర్పడతాయి. ఇవి న్యూరాన్ల మధ్య సమాచార వ్యవస్థను అడ్డుకుని, మెదడు పనితీరును క్రమంగా దెబ్బతీస్తాయని పరిశోధకులు స్పష్టం చేశారు.
పార్కిన్సన్స్ వ్యాధి బారినపడిన వారి మెదడులో 'α-సిన్యూక్లిన్' (α-Synuclein) అనే ప్రోటీన్ అమైలాయిడ్ గడ్డలను ఏర్పరుస్తుంది. కాగా, ఇన్ఫ్లుయెంజా మరియు కోవిడ్-19 వంటి ఆర్‌ఎన్ఏ (RNA) వైరస్‌లు కణాలలోకి ప్రవేశించినప్పుడు తమ జన్యు పదార్థాన్ని 'RNA G-క్వాడ్రుప్లెక్స్‌లు' అనే ప్రత్యేక 3D నిర్మాణాల్లోకి మడుస్తాయి. ఈ నిర్మాణాలు α-సిన్యూక్లిన్ ప్రోటీన్‌తో బంధం ఏర్పరుచుకుని, పార్కిన్సన్స్ వ్యాధికి కారణమయ్యే అమైలాయిడ్ గడ్డలు వేగంగా ఏర్పడేలా ప్రేరేపిస్తున్నాయని ప్రసిద్ధ 'సెల్ రిపోర్ట్స్' (Cell Reports) జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయన రచయిత్రి, సీసీఎంబీ శాస్త్రవేత్త స్వాస్తి రాయచౌధురి వివరించారు.
వైరల్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు కణాలను రక్షించడానికి 'DDX39A' అనే హెలికేస్ ప్రోటీన్ కణద్రవ్యంలోకి విడుదలై ఆర్‌ఎన్ఏ నిర్మాణాలను విడదీసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే, పదేపదే ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు గురికావడం వల్ల కణాల రక్షణ యంత్రాంగం దెబ్బతిని పార్కిన్సన్స్ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు. ప్రతి ఇన్ఫెక్షన్ దీనికి దారితీయకపోయినా, ఇన్ఫ్లుయెంజా, కోవిడ్‌లకు పదేపదే గురైతే ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.




