Alcohol: వారానికోసారి మ‌ద్యం తాగితే ఏం కాద‌ని అనుకుంటున్నారా.? కొత్త అధ్య‌య‌నంలో షాకింగ్ విష‌యాలు

Alcohol: మద్యం విషయంలో చాలా మంది ఒకే అభిప్రాయం కలిగి ఉంటారు. “రోజూ తాగకపోతే ఫర్వాలేదు, వీకెండ్‌లో ఎక్కువ తాగితే ఏమవుతుంది?” అని.

Mokshith
Published on: 18 April 2026 2:55 PM IST
Alcohol
X

Alcohol

Alcohol: మద్యం విషయంలో చాలా మంది ఒకే అభిప్రాయం కలిగి ఉంటారు. “రోజూ తాగకపోతే ఫర్వాలేదు, వీకెండ్‌లో ఎక్కువ తాగితే ఏమవుతుంది?” అని. కానీ తాజా అధ్యయనం ఈ భావన పూర్తిగా తప్పని చెబుతోంది. అప్పుడప్పుడు ఎక్కువగా తాగినా కాలేయానికి (లివర్‌కు) తీవ్రమైన నష్టం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొత్త అధ్యయనం ఏమి చెబుతోంది?

అమెరికాలోని కెక్ మెడిసిన్ ఆఫ్ యూఎస్‌సీతో పాటు యూనివ‌ర్సిటీ ఆఫ్ స‌ద‌ర‌న్ కాలిఫోర్నియా పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ పరిశోధన క్లినిక‌ల్ గ్యాస్ట్రోల‌జీ అండ్ హెప‌టాల‌జీ జర్నల్‌లో ప్రచురితమైంది. ఇందులో ప్రధానంగా అప్పుడప్పుడు ఎక్కువగా మద్యం తాగినా లివర్ డ్యామేజ్ ప్రమాదం పెరుగుతుందని తెలిసింది.

MASLD అంటే ఏమిటి?

ఈ అధ్యయనం ప్రధానంగా Metabolic Dysfunction-Associated Steatotic Liver Disease (MASLD) అనే వ్యాధిపై దృష్టి పెట్టింది. ఈ సమస్యలో కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది, తరువాత ఇన్‌ఫ్లమేషన్ (వాపు) వస్తుంది. ఆపై స్కారింగ్ (గాయపు మచ్చలు) ఏర్పడతాయి. ఈ వ్యాధి ఎక్కువగా ఒబేసిటీ (బరువు ఎక్కువగా ఉండటం), డయాబెటిస్,

హై బ్లడ్ ప్రెజర్ ఉన్నవారిలో కనిపిస్తుంది.

ఒకేసారి ఎక్కువ తాగడం ఎంత ప్రమాదం?

పరిశోధకులు “ఎపిసోడిక్ హెవీ డ్రింకింగ్” అనే అలవాటుపై ఫోకస్ చేశారు. దీనిలో మహిళలు ఒకరోజులో 4 లేదా అంతకంటే ఎక్కువ డ్రింక్స్, పురుషులు ఒకరోజులో 5 లేదా అంతకంటే ఎక్కువ డ్రింక్స్ (కనీసం నెలలో ఒకసారి) తీసుకుంటే లివర్‌పై ఒక్కసారిగా భారీ ఒత్తిడి పడుతుంది. వాపు, నష్టం వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా యువకులు, పురుషుల్లో ఈ అలవాటు ఎక్కువగా కనిపించింది.

స్టడీ ఫలితాలు ఏంటి?

2017 నుంచి 2023 వరకు 8,000 మందికి పైగా పెద్దల డేటాను పరిశీలించారు. దీనిలో ముఖ్యంగా MASLD ఉన్నవారు ఒకేసారి ఎక్కువగా తాగితే అడ్వాన్స్‌డ్ లివర్ ఫైబ్రోసిస్ ప్రమాదం 3 రెట్లు పెరిగింది. లివర్‌లో స్కార్ టిష్యూ ఏర్పడాన్ని ఫైబ్రోసిస్ అంటారు. దీనివ‌ల్ల లివ‌ర్ పని సామర్థ్యం త‌గ్గిపోతుంది.

ఎంత తాగుతున్నామన్నది కాదు, ఎలా తాగుతున్నామన్నదే కీలకం

ఈ స్టడీలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే. వారానికి మొత్తం ఎంత మద్యం తాగుతున్నామన్నది ఒక్కటే ముఖ్యం కాదు దాన్ని ఎలా తాగుతున్నామన్నది ఇంకా కీలకం. ఉదాహరణకు ఇద్దరూ ఒకే మొత్తంలో మద్యం తాగినా గ్యాప్ ఇచ్చి తాగితే ప్ర‌మాదం త‌క్కువ‌గా ఉంటుంద‌ని, ఒకరోజులోనే మొత్తం తాగితే ప్రమాదం ఎక్కువ ఉంటుంద‌ని గుర్తించారు. కాబ‌ట్టి “వీకెండ్‌లో మాత్రమే తాగుతున్నాం కాబట్టి సేఫ్” అనుకోవడం సరైంది కాదు. ఒకేసారి ఎక్కువ మద్యం తాగడం కాలేయానికి తీవ్రమైన హాని చేస్తుంది.

గ‌మ‌నిక‌: పైన తెల‌పిన విష‌యాలు ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలిన అంశాల ఆధారంగా అందించ‌డ‌మైంది. మ‌ద్యం ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story