Mobile Phone Radiation: మొబైల్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుందా? WHO అధ్యయనం చెప్పిందిదే
మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందనే ఆధారాలు లేవని WHO మద్దతుతో జరిగిన తాజా అధ్యయనం వెల్లడించింది.
Mobile Phone Radiation
మొబైల్ ఫోన్ ఎక్కువసేపు ఉపయోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందనే భయాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మద్దతుతో నిర్వహించిన తాజా అధ్యయనం చెక్ పెట్టింది. మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియో తరంగాలు మెదడు, తల లేదా మెడ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయనే దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పరిశోధకులు స్పష్టం చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో విద్యుదయస్కాంత తరంగాల (Electromagnetic Waves) ఆరోగ్య ప్రభావాలపై 13 సమగ్ర సమీక్షలను చేపట్టింది. తాజాగా విడుదలైన నివేదికలో ఆ సమీక్షల ఫలితాలను విశ్లేషించగా, మొబైల్ ఫోన్ వినియోగం మరియు క్యాన్సర్ మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని వెల్లడైంది.
పరిశోధకులు 1994 నుంచి 2022 మధ్య ప్రచురితమైన 63 శాస్త్రీయ అధ్యయనాలను పరిశీలించారు. ఈ విశ్లేషణలో మొబైల్ ఫోన్ వినియోగం వల్ల బ్రెయిన్ క్యాన్సర్, తల లేదా మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
అలాగే రోజుకు ఎక్కువసేపు మొబైల్ ఉపయోగించినా, పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం మొబైల్ వాడినా క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందనే విషయానికి కూడా ఆధారాలు కనిపించలేదని నివేదిక పేర్కొంది.
పిల్లల్లో లుకేమియా (రక్త క్యాన్సర్) వంటి వ్యాధులకు రేడియో, టెలివిజన్ ప్రసారాల నుంచి వచ్చే రేడియో తరంగాలతో సంబంధం ఉందనే వాదనకు కూడా ఎలాంటి బలమైన ఆధారాలు లేవని పరిశోధకులు తెలిపారు.
అయితే విద్యుదయస్కాంత తరంగాల ప్రభావాలపై మరింత పరిశోధన అవసరమని నిపుణులు సూచించారు. కొత్త సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని పేర్కొన్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం అమల్లో ఉన్న మొబైల్ ఫోన్ రేడియేషన్ భద్రతా పరిమితులు సురక్షితంగానే ఉన్నాయని ఈ అధ్యయనం సూచిస్తోంది. మొబైల్ ఫోన్ వినియోగం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందనే ఆందోళనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.




