Relationship Tips: ప్రేమతో ఉన్న బంధాల్లోనూ ఎందుకు ఒంటరితనం? భారతీయులపై సర్వే ఏం చెప్పిందంటే..
ప్రేమతో కూడిన బంధంలో ఉన్నా 57% మంది భారతీయులు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారని సర్వే వెల్లడించింది. అసలు కారణాలేంటో తెలుసుకోండి.
Relationship Tips
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉన్నప్పటికీ, మనసులో మాత్రం ఒంటరితనాన్ని అనుభవిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో 92 శాతం మంది తమ ప్రస్తుత బంధంతో సంతృప్తిగా ఉన్నామని చెప్పినా, ఆశ్చర్యకరంగా 57 శాతం మంది ప్రేమించే భాగస్వామి పక్కనే ఉన్నా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు వెల్లడించారు. ఒకే ఇంట్లో కలిసి జీవించడం, రోజువారీ బాధ్యతలను పంచుకోవడం మాత్రమే భావోద్వేగ సంతృప్తికి సరిపోదని, నిజమైన అనుబంధం కోసం ఒకరినొకరు అర్థం చేసుకోవడం, భావాలను పంచుకోవడం ఎంతో ముఖ్యమని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 84 శాతం మంది తమ ప్రేమ లేదా దాంపత్య జీవితంపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, కేవలం 25 శాతం మంది మాత్రమే తమ బంధంలో ఎలాంటి లోటు లేదని పేర్కొన్నారు. మిగిలిన వారిలో చాలామంది తమ సంబంధంలో భావోద్వేగ అనుబంధం తగ్గిందని, భాగస్వామితో మరింత అర్థవంతమైన సంభాషణలు కావాలని, బంధంలో కొత్తదనం, ఉత్సాహం తగ్గిపోయిందని అభిప్రాయపడ్డారు. మరికొందరు శారీరక సాన్నిహిత్యం కంటే భావోద్వేగ దగ్గరితనమే తమకు ఎక్కువగా కావాలని చెప్పారు.
ప్రేమ ఉన్నా ఎందుకు ఒంటరితనం?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న పని ఒత్తిడి, సమయం లేకపోవడం, కుటుంబ బాధ్యతలు, డిజిటల్ పరికరాల వినియోగం వల్ల భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపే అవకాశాలు తగ్గుతున్నాయి. ఫలితంగా ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, భావోద్వేగ పరంగా ఇద్దరూ వేర్వేరు ప్రపంచాల్లో జీవిస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. రోజువారీ సంభాషణలు కూడా ఇంటి పనులు, ఖర్చులు లేదా ఇతర బాధ్యతలకే పరిమితం కావడంతో మనసులోని భావాలను పంచుకునే అవకాశం తగ్గిపోతోంది.
సోషల్ మీడియా, సినిమాలు చూపించే "పర్‌ఫెక్ట్ రిలేషన్‌షిప్" చిత్రాలు కూడా చాలామందిలో అవాస్తవ అంచనాలను పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇతరుల జీవితాలతో తమ బంధాన్ని పోల్చుకోవడం వల్ల అసంతృప్తి పెరిగి, భాగస్వామితో ఉన్న అనుబంధాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
సంబంధం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదని, పరస్పరం ఒకరినొకరు వినడం, భావాలను స్వేచ్ఛగా పంచుకోవడం, నాణ్యమైన సమయాన్ని కలిసి గడపడం, నమ్మకం మరియు గౌరవాన్ని పెంపొందించుకోవడం కూడా అంతే ముఖ్యమని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిజమైన బంధం అనేది కలిసి జీవించడంలో కాదు, ఒకరినొకరు భావోద్వేగంగా అర్థం చేసుకుని తోడుగా నిలవడంలో ఉందని వారు పేర్కొంటున్నారు.




