Obesity Problems: లావుగా ఉన్నారంటే ఆరోగ్యంగా ఉన్నట్టేనా? బొజ్జ పెరిగితే బలంగా ఉన్నట్టా?

Obesity Problems: రోజూ కడుపు నిండా భోజనం చేయడం, శరీరం చూడటానికి బొద్దుగా లేదా బరువు ఎక్కువగా ఉండటం చూసి చాలామంది తాము చాలా ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తారు.

CR Reddy
Published on: 15 Sept 2026 9:05 AM IST
Obesity
X

Obesity 

Obesity Problems: రోజూ కడుపు నిండా భోజనం చేయడం, శరీరం చూడటానికి బొద్దుగా లేదా బరువు ఎక్కువగా ఉండటం చూసి చాలామంది తాము చాలా ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తారు. కానీ బయటికి అంతా బాగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ.. లోపల శరీరం తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతుంటుంది. ఇటీవల ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో సుమారు 4,000 మందిపై నిర్వహించిన ఒక మెటబాలిక్ హెల్త్ అధ్యయనంలో ఈ ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ శరీరంలో విటమిన్లు, ప్రొటీన్లు, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు కొరవడుతున్నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మిలేనియల్స్ అధిక బరువు సమస్య

ఈ అధ్యయనం ప్రకారం మిలేనియల్స్ తరానికి చెందిన సుమారు 55.7 శాతం మంది అధిక బరువు లేదా స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారు. అలాగే 45 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 70.8 శాతం మందిలో విసెరల్ ఫ్యాట్(శరీరంలో అవయవాల చుట్టూ పేరుకుపోయే ప్రమాదకరమైన కొవ్వు) మోతాదు ప్రమాదకర స్థాయిలో పెరిగినట్లు తేలింది. కేవలం బరువు లేదా బాడీ మాస్ ఇండెక్స్ (BMI) సాధారణంగా ఉన్నంత మాత్రాన అందరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎక్కువ కేలరీలు.. కానీ పోషకాలు శూన్యం

నేటి ఆధునిక జీవనశైలిలో జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కడుపు నిండుతుంది కానీ శరీరానికి కావలసిన విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్లు అందవు. ముఖ్యంగా విటమిన్-డీ లోపం పట్టణ ప్రాంతాల ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తోంది. పొట్ట చుట్టూ పేరుకుపోయే అదనపు కొవ్వుకు, విటమిన్-డీ లోపానికి మధ్య బలమైన సంబంధం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. బరువు తగ్గాలనే తొందరలో చాలామంది ఆహారాన్ని పూర్తిగా మానేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గినట్లు అనిపించినా, శరీరానికి అవసరమైన పోషకాలు అందక తీవ్రమైన నీరసం, బలహీనత వస్తాయి.

కేవలం బరువు కాదు ఆరోగ్యం ముఖ్యం

అధిక బరువుతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ-డయాబెటిస్, ఫ్యాటీ లీవర్, కొలెస్ట్రాల్ సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అందుకే కేవలం బరువును మాత్రమే చూసుకోకుండా, అప్పుడప్పుడు రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. రోజూ తీసుకునే ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలని, తద్వారా శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.