Induction Stove: ఇండక్షన్ స్టౌపై రోటీలు కాల్చాలంటే ఓ యుద్ధమే చేయాలి.. ఎందుకో తెలుసా?
Induction Cooktop Roti Issues: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల ప్రస్తుతం అంతా ఇండక్షన్ స్టవ్ లపైపు చూస్తున్నారు. అయితే, వీటిపై రోటీలు చేయడం కుదురుతుందా లేదా అనేది తెలుసుకుందాం..
Induction Stove
Why Roti Not Puffing on Induction: ప్రస్తుత రోజుల్లో గ్యాస్ ధరల పెరుగుదల, సిలిండర్ల కొరత కారణంగా చాలామంది ఇండక్షన్ స్టౌల వైపు మొగ్గు చూపుతున్నారు. కూరలు, పప్పులు వండటానికి ఇది బాగానే ఉన్నా, రోటీలు చేసేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఇండక్షన్ మీద రోటీలు సరిగ్గా కాలకపోవడానికి లేదా గట్టిగా రావడానికి గల కారణాలను ఓసారి చూద్దాం..
గ్యాస్ స్టౌకు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్..
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీజీ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో భారత్‌లోనూ చాలామంది కిచెన్‌లో గ్యాస్ సిలిండర్ల వాడకాన్ని తగ్గించి, ఇండక్షన్ కుక్‌టాప్‌లను వాడుతున్నారు. అయితే, ఈ స్టౌపై రోటీలు కాల్చడం ఒక సవాలుగా మారింది. చాలా సందర్భాల్లో రోటీలు పచ్చిగా ఉండటం లేదా మాడిపోవడం జరుగుతోంది. ఇది సాంకేతిక లోపం కాదు, ఇండక్షన్ పనిచేసే విధానంలోనే అసలు రహస్యం దాగి ఉంది.
ఫెరడే విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రం..
ఇండక్షన్ స్టౌ పనిచేయడానికి భౌతిక శాస్త్రంలోని 'ఫెరడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం' ఆధారంగా పనిచేస్తుంది. దీని ప్రకారం, ఒక తీగ చుట్ట గుండా విద్యుత్తు ప్రవహించినప్పుడు అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇండక్షన్ స్టౌలో కూడా ఇదే జరుగుతుంది. లోపల ఉండే కాయిల్ ద్వారా అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించి, దానిపై ఉంచిన లోహపు పాత్రలో విద్యుత్ ప్రవాహాన్ని (ఎడ్డీ కరెంట్స్) పుట్టిస్తుంది. తద్వారా పాత్ర వేడెక్కుతుంది తప్ప, బయటకు మంట రాదు.
రోటీలు రాకపోవడానికి ప్రధాన కారణాలు..
నేరుగా మంట లేకపోవడం: రోటీలు చక్కగా పొంగాలంటే నేరుగా మంట (ఫ్లేమ్) తగలాలి. ఇండక్షన్ కేవలం పాత్ర అడుగు భాగాన్ని మాత్రమే వేడి చేస్తుంది. గ్యాస్ స్టౌ మీద రోటీని మంట మీద వేయగానే అందులోని తేమ ఆవిరై రోటీ పొంగుతుంది. ఇండక్షన్‌లో ఆ అవకాశం లేకపోవడమే అతిపెద్ద లోపం.
ఉష్ణ పంపిణీలో అసమతుల్యత: ఫెరడే సూత్రం ప్రకారం, పాత్ర ఏ భాగం అయితే స్టౌ ఉపరితలానికి తగులుతుందో అది మాత్రమే వేడెక్కుతుంది. రోటీ కాల్చడానికి చుట్టూ సమానమైన వేడి గాలి అవసరం. కానీ, ఇండక్షన్ మీద పెనం కేవలం అడుగున మాత్రమే వేడెక్కుతుంది, దీనివల్ల రోటీ చుట్టూ ఉష్ణోగ్రత సరిగ్గా అందక అది సరిగ్గా ఉడకదు.
పెనం ఆకృతి: ఇండక్షన్ స్టౌ మీద వాడే పాత్రల అడుగు భాగం పూర్తిగా చదునుగా ఉండాలి. సాధారణ రోటీ పెనాలు కొద్దిగా వంపు తిరిగి ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన ఇండక్షన్ పెనాలు వాడినా, వాటి అంచులకు వేడి సరిగ్గా అందదు. దీనివల్ల మధ్యలో మాడిపోయి, అంచుల్లో రోటీ పచ్చిగా ఉంటుంది.
పరిష్కారం ఏమిటి?
ఇండక్షన్ మీద రోటీలు చేయడం కోసం ప్రస్తుతం కొన్ని 'రోటీ మేకర్' గ్రిల్స్ లేదా స్టీల్ జాలీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పెనం మీద ఉంచి ప్రయత్నించవచ్చు. అయితే, గ్యాస్ స్టౌ మీద కాల్చిన రోటీకి ఉండే రుచి, నాణ్యత ఇండక్షన్ మీద రావడం కష్టమే. ఇన్‌ఫ్రారెడ్ స్టౌలు ఇండక్షన్ కంటే రోటీల తయారీకి కొంతవరకు మెరుగ్గా పనిచేస్తాయి.


