వేసవిలో వీధి కుక్కలు ఎందుకని ఎక్కువగా దాడి చేస్తాయో తెలుసా.? కారణం ఇదే!

Street Dog Attacks: వేసవి రాగానే వీధి కుక్కల దాడులు ఎందుకు పెరుగుతాయో ఎప్పుడైనా గమనించారా? ఎండ వేడికి అవి ఎందుకు అంత కోపంగా మారుతాయి.

Ravi
By Ravi
Published on: 27 May 2026 5:27 PM IST
Street Dog Attacks
X

వేసవిలో వీధి కుక్కలు ఎందుకని ఎక్కువగా దాడి చేస్తాయో తెలుసా.? కారణం ఇదే!

Street Dog Attacks: ఎండాకాలం వచ్చిందంటే చాలు, మనకు చెమటలు పట్టడమే కాదు.. వీధి కుక్కల ప్రవర్తనలో కూడా చాలా మార్పు వస్తుంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కుక్కలు వెంబడించడం, పిల్లలపై దాడి చేయడం లాంటి వార్తలు ఈ మధ్య మనం రోజూ టీవీల్లో చూస్తూనే ఉన్నాం. అసలు ఎండాకాలంలోనే వీధి కుక్కలు ఎందుకింత ఆవేశంగా మారుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? వేసవి తాపం మనుషులకే కాదు జంతువులకు కూడా కష్టమే.

దీని వెనుక ఉన్న ముఖ్య కారణం ఎండ వేడి. మనలాగే జంతువులకు కూడా ఎండల వల్ల విపరీతమైన దాహం, అసౌకర్యం, చిరాకు కలుగుతాయి. వీధి కుక్కలకు సమయానికి తాగడానికి నీరు, ఉండటానికి నీడ దొరక్కపోవడం వల్ల అవి డీహైడ్రేషన్‌కు గురవుతాయి. ఆ విపరీతమైన అసౌకర్యం వల్లే అవి అగ్రెసివ్‌గా మారి, చిన్న శబ్దానికే భయపడి ఎదుటివారిపై దాడికి దిగుతాయని జంతు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఆడుకుంటున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు కుక్కలు వారిని తమకు ముప్పుగా భావించే ప్రమాదం ఉంది. ఇలాంటప్పుడు మనం కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మొదటగా, ఎండలో పడుకున్న కుక్కలను నిద్రలేపడం, వాటిపైకి రాళ్లు విసరడం లేదా కర్రతో బెదిరించడం లాంటి పనులు పిల్లలు చేయకుండా పెద్దలు చూసుకోవాలి. కుక్క కోపంగా అరుస్తున్నప్పుడు భయపడి పరిగెత్తకూడదు. నెమ్మదిగా అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోవడం సురక్షితం. అలాగే రాత్రి పూట ఒంటరిగా బైక్‌పై వెళ్లేటప్పుడు కుక్కలు వెంబడిస్తే, స్పీడ్ పెంచకుండా బండి ఆపేస్తే అవే వెళ్లిపోతాయి. ప్రాణ రక్షణ కోసం ఇది చాలా ముఖ్యం. వీధిలో నడిచేటప్పుడు ఎప్పుడూ చుట్టుపక్కల గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి.

మనమందరం మనుషులం, కనీసం మన బాధను మాటల్లో చెప్పుకోగలం. కానీ ఆ మూగ జీవాలకు ఆకలి వేసినా, దాహం వేసినా ఎవరికీ చెప్పలేవు కదా. అందుకే మీకు వీలైతే మీ ఇంటి బయట ఒక చిన్న మట్టి కుండలో కాస్త నీళ్లు పెట్టండి. ఆ మూగ జీవాలకు దాహం తీరితే, ఆ చిరాకు తగ్గిపోయి అవి ఎవరి మీదా దాడి చేయవు. కుక్కల దాడుల నుంచి రక్షణ పొందడం కేవలం మున్సిపల్ అధికారుల బాధ్యతే కాదు. సామాన్య పౌరులుగా మనం కూడా కొంచెం మానవత్వంతో ఆలోచించాలి, అదే సమయంలో పిల్లల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎండల తీవ్రత పూర్తిగా తగ్గేదాకా చిన్న పిల్లల్ని వీధుల్లో ఒంటరిగా అస్సలు వదిలేయకండి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story