Property Planning : వీలునామా లేకపోతే.. మీ ఆస్తే కుటుంబానికి శాపం కావచ్చు.!

Property Planning : చాలా ఏళ్ల క్రితం ఒకే ఇంట్లో కలిసి పెరిగిన ఇద్దరు అన్నదమ్ములు, తండ్రి మరణం తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం పూర్తిగా మానేశారు.

G Krishna
Published on: 6 Jun 2026 7:28 PM IST
Property Planning
X

Property Planning 

Property Planning : చాలా ఏళ్ల క్రితం ఒకే ఇంట్లో కలిసి పెరిగిన ఇద్దరు అన్నదమ్ములు, తండ్రి మరణం తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం పూర్తిగా మానేశారు. దానికి కారణం వారి మధ్య జరిగిన పెద్ద వ్యాపార గొడవలు కావు, తండ్రి ఎంతో కష్టపడి కట్టిన ఇల్లు మాత్రమే. ఆయన తన పిల్లల కోసం ఎంతో సంపాదించారు కానీ, ఒక ముఖ్యమైన పనిని మాత్రం మర్చిపోయారు.. అదే 'వీలునామా' రాయడం. ఆయన మరణించిన కొద్ది నెలలకే ఆ అన్నదమ్ములు కోర్టు మెట్లు ఎక్కడం, అనుబంధాలు తెగిపోవడం, ఆ ఇల్లు తాళం వేసి అలాగే ఉండిపోవడం జరిగిపోయాయి. ఇది కేవలం ఒక కుటుంబం కథ కాదు, మన చుట్టూ ప్రతిరోజూ కనిపిస్తున్న చేదు నిజం.

సంపద పెరుగుతోంది.. కానీ వారసత్వ ప్రణాళిక ఏదీ?

నేటి భారతీయులు మునుపటి కంటే ఆర్థికంగా ఎంతో బలంగా ఉంటూ ఇళ్లు కొంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు, స్టాక్ మార్కెట్లలో రాణిస్తున్నారు. అయితే సంపదను సృష్టించడంలో చూపిస్తున్న శ్రద్ధను, ఆ సంపదను తమ తర్వాత ఎవరికి ఎలా అందాలో ప్లాన్ చేయడంలో మాత్రం చూపడం లేదు. '1 ఫైనాన్స్ మ్యాగజైన్' నిర్వహించిన ఒక అధ్యయనంలో దీనికి సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆ సర్వే ప్రకారం దాదాపు 84.8% మంది భారతీయుల వద్ద వీలునామా లేదు. అంతేకాకుండా 62.5% మందికి అసలు వీలునామా రాయాలనే ఆలోచనే లేదని, కేవలం 15.2% మంది మాత్రమే ఇప్పటివరకు వీలునామా రాశారని తేలింది.

వాయిదా వేస్తున్న చర్చ.. సమాజంలోని అపోహలు

భారతీయ సమాజంలో 'మరణం' గురించి లేదా 'మరణం తర్వాత ఆస్తుల పంపకం' గురించి మాట్లాడటాన్ని ఒక నిషిద్ధాంశంగా భావిస్తారు. వీలునామా గురించి మాట్లాడితే అశుభం జరుగుతుందని కొందరు, తమ పిల్లలే అంతా సర్దుకుంటారని మరికొందరు భావిస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. కానీ, ఆధునిక కాలంలో ఆస్తులు అంటే కేవలం నగదు, నగలే కాకుండా ఇన్సూరెన్స్ పాలసీలు, డిజిటల్ ఆస్తులు, విదేశీ పెట్టుబడులు కూడా ఉంటున్నాయి. సరైన పత్రాలు లేకపోతే వాటిని వారసులకు బదిలీ చేయడం చట్టపరంగా పెద్ద సమస్యగా మారుతుంది.

యూనివర్సల్ ట్రస్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ నాసా ప్రకారం, వీలునామా కేవలం ధనికుల కోసమే అనే అపోహ జనాల్లో బలంగా ఉంది. కానీ మీకు రక్షణ కల్పించాల్సిన ఆస్తి ఉండి, దానిపై ఆధారపడే కుటుంబ సభ్యులు ఉన్న ఎవరైనా వీలునామా రాయవచ్చు. అలాగే వృద్ధాప్యంలోనే వీలునామా రాయాలనే నియమం ఏమీ లేదని, సంపాదన మొదలుపెట్టి ఆస్తులు సృష్టించడం ప్రారంభించినప్పుడే దీని గురించి ఆలోచించడం ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా మంది బ్యాంకు డిపాజిట్లలో నామినీగా ఉన్న వ్యక్తియే యజమాని అనుకుంటారు, కానీ నామినీ కేవలం ఆ డబ్బును స్వీకరించే ప్రతినిధి మాత్రమే, చట్టబద్ధమైన వారసుడు కాదు. ఇటువంటి విషయాల్లో వీలునామా ఉంటేనే పూర్తి స్పష్టత వస్తుంది.

ఇది కేవలం చట్టపరమైన పత్రం కాదు.. ఒక భరోసా..!

వీలునామాను కేవలం ఆస్తి పత్రంలా చూడకూడదు, అది ఒక కుటుంబ పత్రం. మీ తర్వాత మీ కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గందరగోళం, మనస్పర్థలు రాకుండా మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి అది. మరణం వల్ల కలిగే దుఃఖాన్ని వీలునామా తొలగించలేదు కానీ, ఆస్తి విషయంలో తలెత్తే అనుమానాలను మాత్రం ఖచ్చితంగా తొలగిస్తుంది.

మనం మన జీవితమంతా కష్టపడి ఆస్తులు కూడబెట్టేది మన పిల్లలు, కుటుంబం సుఖంగా ఉండాలనే ఉద్దేశంతోనే. కానీ ఆ సంపదే వారి మధ్య చిచ్చు పెట్టకూడదంటే ఒక 'వీలునామా' రాయడం చాలా అవసరం. నిశ్చయంగా చెప్పాలంటే, మీరు మీ వారసులకు ఇచ్చే ఆస్తి కంటే, వారు ప్రశాంతంగా కలిసి ఉండేలా చూసే 'స్పష్టత' చాలా విలువైనది. కాబట్టి, మరో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసే ముందు, ఒక వీలునామా సిద్ధం చేయడం గురించి ఆలోచించడం ఎంతో ముఖ్యం.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story