పని ఒత్తిడిని లైట్ తీసుకుంటున్నారా.? ఇది మానసిక సమస్యగా మారే ప్రమాదం ఉంది
Work Stress: ఆఫీసులో డెడ్‌లైన్లు, వరుస మీటింగులు, బాస్ ఒత్తిడి, పని పూర్తి కావడం లేదనే ఆందోళన.. ఇలా ఉద్యోగ జీవితంలో ఒత్తిడి సాధారణంగా మారిపోయింది.
పని ఒత్తిడిని లైట్ తీసుకుంటున్నారా.? ఇది మానసిక సమస్యగా మారే ప్రమాదం ఉంది
Work Stress: ఆఫీసులో డెడ్‌లైన్లు, వరుస మీటింగులు, బాస్ ఒత్తిడి, పని పూర్తి కావడం లేదనే ఆందోళన.. ఇలా ఉద్యోగ జీవితంలో ఒత్తిడి సాధారణంగా మారిపోయింది. అయితే అదే ఒత్తిడి ఎక్కువకాలం కొనసాగుతూ నిద్ర, పని, కుటుంబ సంబంధాలు, రోజువారీ జీవితంపై ప్రభావం చూపితే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
ఒత్తిడి ఎప్పుడు మానసిక సమస్యగా మారుతుంది?
పని భారం పెరిగినప్పుడు కొంతకాలం ఒత్తిడి, ఆందోళన, అలసట ఉండటం సహజమే. కానీ ఆ సమస్యలు రోజులు, వారాలు గడిచినా తగ్గకుండా కొనసాగితే జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా పని మీద దృష్టి పెట్టలేకపోవడం, రోజువారీ పనులు చేయడం కష్టంగా అనిపించడం, ఇంట్లో వారితో మాట్లాడాలనే ఆసక్తి తగ్గడం వంటి మార్పులు కనిపిస్తే మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మానసిక ఆరోగ్యాన్ని కేవలం వ్యాధి కోణంలో మాత్రమే చూడకూడదు. సాధారణ ఒత్తిడి, మానసిక ఇబ్బంది, మానసిక రుగ్మత.. ఇవన్నీ ఒకేలా ఉండవు. ఒక వ్యక్తి ఎదుర్కొనే సమస్య తీవ్రత, అది ఎంతకాలం కొనసాగుతోంది, రోజువారీ జీవితంపై ఎంత ప్రభావం చూపుతోంది అనే విషయాలు ముఖ్యమైనవి. భారత్‌లో మానసిక ఆరోగ్య పరిస్థితిపై నిర్వహించిన నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే 2015-16 ప్రకారం, సుమారు 10.6 శాతం మంది పెద్దల్లో అప్పటికి ఏదో ఒక మానసిక రుగ్మత ఉన్నట్లు గుర్తించారు. అయితే అవసరం ఉన్నవారిలో చాలామందికి సరైన సమయంలో చికిత్స అందడం లేదని ఆ సర్వే వెల్లడించింది.
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి
పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం అలసట మాత్రమే కాకుండా మానసికంగా కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. ఎప్పుడూ చిరాకుగా ఉండటం, చిన్న విషయాలకే కోపం రావడం, కారణం లేకుండానే ఆందోళన చెందడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే నిద్ర సరిగా పట్టకపోవడం లేదా సాధారణం కంటే ఎక్కువగా నిద్రపోవడం, పనిపై ఆసక్తి తగ్గడం, ఏకాగ్రత కుదరకపోవడం, ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపించడం వంటి సమస్యలు కూడా రావచ్చు. కొందరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం తగ్గించి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. డిప్రెషన్‌లో ఎక్కువకాలం బాధగా లేదా నిరాశగా ఉండటం, గతంలో ఇష్టపడిన విషయాలపై ఆసక్తి తగ్గడం వంటి మార్పులతో పాటు నిద్ర, ఆకలి, శక్తి, ఏకాగ్రతలో కూడా మార్పులు కనిపించవచ్చు. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికీ డిప్రెషన్ ఉందని చెప్పలేం. నిపుణుల పరిశీలన అవసరం.
ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
ఒత్తిడి, ఆందోళన లేదా ఇతర మానసిక సమస్యలు కొంతకాలం గడిచినా తగ్గకపోతే మెంటల్ హెల్త్ నిపుణుడిని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా నిద్ర, ఉద్యోగం, కుటుంబ జీవితం లేదా రోజువారీ పనులు ప్రభావితమవుతున్నప్పుడు ఆలస్యం చేయకూడదు. తన సమస్యను తానే నియంత్రించుకోలేకపోతున్నట్లు అనిపించినా, నిపుణుల సహాయం తీసుకోవాలి. మానసిక ఆరోగ్య నిపుణుడిని కలవడం అంటే వెంటనే మందులు వాడాల్సిందేనని కాదు. ముందుగా వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకుని, అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్, జీవనశైలిలో మార్పులు లేదా ఇతర చికిత్సా విధానాలను సూచిస్తారు. అందుకే పని ఒత్తిడిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు. పని ఎంత ముఖ్యమో.. మన మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడి ఎక్కువకాలం కొనసాగుతున్నట్లు అనిపిస్తే సమస్య పెద్దదయ్యే వరకు వేచి ఉండకుండా సరైన సమయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.




