బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాలు ఇవ్వొచ్చా? తల్లులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

World Breastfeeding Week: ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవం నిర్వహిస్తారు.

Mokshith
Published on: 3 Aug 2026 1:36 PM IST
World Breastfeeding Week
X

బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాలు ఇవ్వొచ్చా? తల్లులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

World Breastfeeding Week: ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవం నిర్వహిస్తారు. తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన పెంచడం, తల్లులకు మెరుగైన సహకారం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

170కి పైగ దేశాల్లో

ప్రపంచంలోని 170కి పైగా దేశాల్లో ఈ వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్‌ఫీడింగ్ యాక్షన్ (WABA) ఆధ్వర్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూనిసెఫ్ (UNICEF), ప్రభుత్వాలు, ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది Breastfeeding for a Sustainable Start in Life: Strengthen What Works అనే థీమ్‌తో త‌ల్లిపాల వారోత్స‌వం నిర్వ‌హిస్తున్నారు. ఇప్పటికే మంచి ఫలితాలు ఇస్తున్న తల్లిపాల కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం, తల్లులకు సరైన వైద్య సలహాలు అందించడం, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం ఈ థీమ్ లక్ష్యం.

పుట్టిన బిడ్డకు ఆకలి సమయం ఉండదు..

పెద్దవాళ్లలా బిడ్డలు నిర్ణీత సమయానికి మాత్రమే ఆహారం తీసుకోరు. వారికి ఆకలి వేసినప్పుడల్లా తల్లిపాలు అవసరం అవుతాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ బిడ్డకు అవసరమైనప్పుడల్లా, పగలు-రాత్రి తేడా లేకుండా తల్లిపాలు ఇవ్వాలని సూచిస్తోంది. ఇంటికి వెళ్లాక లేదా ప్రత్యేక గది దొరికాక ఇస్తానని ఆలస్యం చేయడం వల్ల బిడ్డ ఇబ్బంది పడుతుంది. సమయానికి పాలు ఇవ్వడం వల్ల బిడ్డ ఎదుగుదల బాగుండటంతో పాటు తల్లిలో పాల ఉత్పత్తి కూడా సక్రమంగా కొనసాగుతుంది.

బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాలు ఇవ్వడం పూర్తిగా సురక్షితం

చాలా మంది తల్లులు బయట తల్లిపాలు ఇవ్వడం సురక్షితమేనా అనే సందేహంలో ఉంటారు. కానీ వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పే ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి లేదా బిడ్డకు అదనపు ఆరోగ్య ప్రమాదం ఉండదు. తల్లిపాలు సహజంగా శుభ్రమైన, పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం. పార్క్, షాపింగ్ మాల్, విమానాశ్రయం, రైల్వే స్టేషన్, ఆసుపత్రి వేచి ఉండే ప్రదేశం వంటి చోట్ల బిడ్డకు పాలు ఇచ్చినా వాటి నాణ్యతలో ఎలాంటి మార్పు ఉండదు. పరిసరాలు సాధారణంగా పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి ఆందోళన అవసరం లేదు.

తల్లులకు అవసరమైంది అనుమతి కాదు.. సహకారం

బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాలు ఇవ్వడానికి అనుమతి ఉందా అనే దానికంటే, తల్లులు ఎలాంటి భయం లేకుండా పాలు ఇవ్వగలిగే వాతావరణం ఉండటం చాలా ముఖ్యం అని WHO, UNICEF, WABA చెబుతున్నాయి. అందుకే కార్యాలయాల్లో తల్లులకు ప్రత్యేక సౌకర్యాలు, ప్రసూతి సెలవులు, తల్లిపాలు ఇవ్వడానికి అనువైన గదులు, సరైన వైద్య సలహాలు ఉండాలని సూచిస్తున్నాయి. భారత్‌లో కూడా తల్లి-శిశు సంక్షేమ కార్యక్రమాల ద్వారా తల్లిపాలను ప్రోత్సహిస్తున్నారు. విమానాశ్రయాలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా నర్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా పెరుగుతున్నాయి.

సమాజం మద్దతు ఉండాల్సిందే..

ప్రతి తల్లి తనకు సౌకర్యంగా అనిపించిన విధంగా బిడ్డకు తల్లిపాలు ఇవ్వవచ్చు. కొందరు నర్సింగ్ కవర్ ఉపయోగిస్తారు. మరికొందరు అవసరం లేదని భావిస్తారు. దీనిపై బలవంతంగా పాటించాల్సిన నిబంధనలు ఏవీ లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్నిసార్లు ఇతరులు చూస్తారనే భయం, సామాజిక అపోహలు తల్లులను ఇబ్బంది పెడుతుంటాయి. దీనివల్ల అవసరమైన సమయంలో కూడా బిడ్డకు పాలు ఇవ్వడానికి సంకోచించే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు మారాలంటే కుటుంబ సభ్యులు, భర్త, స్నేహితులు, వైద్యులు, ఉద్యోగ సంస్థలు, సమాజం అందరూ తల్లులకు అండగా నిలవాలి. ఒక మంచి మాట, గౌరవప్రదమైన ప్రవర్తన, కూర్చునేందుకు అనువైన స్థలం కల్పించడం వంటి చిన్న సహాయం కూడా తల్లిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

తల్లిపాలు ఇవ్వడం తల్లి ఒక్కరి బాధ్యత కాదు

తల్లిపాలు విజయవంతంగా కొనసాగాలంటే కుటుంబం, ఉద్యోగ సంస్థలు, ఆరోగ్య సిబ్బంది, సమాజం అందరి సహకారం అవసరం. ఉద్యోగానికి వెళ్లే తల్లుల కోసం ప్రసూతి సెలవులు, తల్లిపాలు ఇవ్వడానికి విరామ సమయం, అవసరమైతే ప్రత్యేక గదులు వంటి సౌకర్యాలు కల్పించాలని WHO, UNICEF సూచిస్తున్నాయి. World Breastfeeding Week 2026 సందర్భంగా ప్రపంచానికి ఇచ్చే ప్రధాన సందేశం ఒక్కటే. తల్లులు తమ బిడ్డలకు ఎప్పుడు, ఎక్కడ అవసరమైతే అక్కడ తల్లిపాలు ఇవ్వడానికి ఎలాంటి సంకోచం లేకుండా ఉండే సమాజాన్ని నిర్మించాలి. తల్లికి మద్దతు లభిస్తే బిడ్డకు ఆరోగ్యకరమైన ప్రారంభం లభిస్తుంది. అదే సమాజం భవిష్యత్తును మరింత ఆరోగ్యవంతంగా మారుస్తుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story