World Diabetes Day 2026: డయాబెటిస్తో చూపు పోయే ప్రమాదం.. కంటికి సంబంధించిన ఈ 5 అపోహలు నమ్మకండి
డయాబెటిస్ ఉన్నవారికి కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతి ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే చూపును దెబ్బతీయవచ్చు.
World Diabetes Day 2026
World Diabetes Day 2026: డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం వల్ల గుండె, మూత్రపిండాలే కాదు.. కళ్లకూ ముప్పు ఉంటుంది. అయితే చాలామంది చూపు స్పష్టంగా కనిపిస్తున్నంత వరకు కళ్ల ఆరోగ్యంపై పెద్దగా దృష్టి పెట్టరు. కానీ డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు చూపించకుండానే కంటి లోపల నష్టాన్ని కలిగించవచ్చు. చూపు మసకబారే సమయానికి సమస్య ముదిరిపోయే ప్రమాదం ఉంటుంది. నవంబర్ 14న ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా వైద్యులు చెబుతున్న ఐదు ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
చూపు స్పష్టంగా ఉంటే కళ్లకు సమస్య లేనట్టేనా?
ఇది డయాబెటిస్ ఉన్నవారిలో కనిపించే ప్రధాన అపోహ. రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే కంటి వెనుక భాగంలో ఉండే రెటీనాలోని చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. వాటి నుంచి ద్రవం లేదా రక్తం బయటకు రావచ్చు. కొన్నిసార్లు ఆ ప్రాంతానికి ఆక్సిజన్ సరఫరా తగ్గడంతో కొత్త రక్తనాళాలు కూడా అసాధారణంగా పెరుగుతాయి. ఈ మార్పులు మొదట్లో చూపుపై ప్రభావం చూపకపోవచ్చు. అందుకే కళ్లు బాగానే కనిపిస్తున్నాయని పరీక్షలు చేయించుకోకుండా ఉండకూడదు. చూపు మసకబారడం, కళ్ల ముందు నల్లటి మచ్చలు కనిపించడం వంటి లక్షణాలు వచ్చేవరకు వేచి ఉండటం ప్రమాదకరం.
షుగర్ నియంత్రణలో ఉంటే కళ్లకు ప్రమాదం ఉండదా?
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం వల్ల డయాబెటిస్ కారణంగా వచ్చే కంటి సమస్యల ముప్పు తగ్గుతుంది. కానీ పూర్తిగా ప్రమాదం తొలగిపోతుందని చెప్పలేం. యూకే ప్రాస్పెక్టివ్ డయాబెటిస్ స్టడీ(UKPDS)లో రక్తంలో గ్లూకోజ్‌ను మెరుగ్గా నియంత్రించడం వల్ల చిన్న రక్తనాళాలకు సంబంధించిన సమస్యల ముప్పు సుమారు 25 శాతం తగ్గినట్లు వెల్లడైంది. అయితే ఎంతకాలంగా డయాబెటిస్ ఉంది, బీపీ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎంత ఉన్నాయి అనే అంశాలు కూడా కంటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి షుగర్ కంట్రోల్లో ఉన్నవారు కూడా వైద్యులు సూచించిన సమయంలో రెటీనా పరీక్షలు చేయించుకోవాలి.
డయాబెటిస్ వల్ల రెటీనాకే సమస్య వస్తుందా?
డయాబెటిస్ వల్ల వచ్చే కంటి సమస్యల్లో డయాబెటిక్ రెటినోపతి ముఖ్యమైనదే. కానీ సమస్య అక్కడితో ఆగిపోదు. షుగర్ ఉన్నవారికి కంట్లోని సహజ లెన్స్ మసకబారే కేటరాక్ట్ (శుక్లాలు), కంటి నాడిని దెబ్బతీసే గ్లకోమా వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అమెరికా నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ వివరాల ప్రకారం, డయాబెటిస్ ఉన్నవారికి కేటరాక్ట్ వచ్చే అవకాశం రెండు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉండొచ్చు. గ్లకోమా ముప్పు కూడా దాదాపు రెట్టింపు అవుతుంది. కేటరాక్ట్ వల్ల చూపు మసకబారుతుంది. గ్లకోమాను గుర్తించకుండా వదిలేస్తే కంటి నాడి దెబ్బతిని శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే కేవలం రెటీనా మాత్రమే కాకుండా కంటి మొత్తం ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి.
ముందుగానే ఇంజెక్షన్లు తీసుకుంటే చూపు పోకుండా ఆపవచ్చా?
డయాబెటిక్ రెటినోపతి చికిత్సలో యాంటీ-VEGF ఇంజెక్షన్లను ఉపయోగిస్తారు. ఇవి రెటీనాలో అసాధారణ రక్తనాళాల పెరుగుదలను తగ్గించడంతో పాటు రక్తనాళాల నుంచి ద్రవం లీక్ కావడాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే ప్రతి ఒక్కరికీ ముందుగానే ఈ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల చూపు తప్పకుండా మెరుగుపడుతుందని చెప్పలేం. 2023లో JAMA జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో 328 మంది రోగులను నాలుగేళ్ల పాటు పరిశీలించారు. ముందుగానే అఫ్లిబెర్సెప్ట్ ఇంజెక్షన్లు తీసుకున్నవారిలో తీవ్రమైన రెటీనా సమస్యలు వచ్చే అవకాశం తగ్గింది. అయితే సాధారణంగా చూసే చూపు సామర్థ్యంలో పర్యవేక్షణతో పాటు అవసరమైనప్పుడు చికిత్స పొందినవారితో పోలిస్తే గణనీయమైన మెరుగుదల కనిపించలేదు. అందుకే రోగి పరిస్థితిని బట్టి వైద్యులే చికిత్స నిర్ణయించాలి. అవసరం లేకుండా ఇంజెక్షన్లు తీసుకోవడం సరైన పద్ధతి కాదు.
చూపు మసకబారితేనే కంటి పరీక్ష చేయించుకోవాలా?
ఇది చాలా ప్రమాదకరమైన నిర్లక్ష్యం. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు వ్యాధి నిర్ధారణ అయినప్పుడే సమగ్ర కంటి పరీక్ష చేయించుకోవాలని వైద్య మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారికి సాధారణంగా వ్యాధి ప్రారంభమైన ఐదేళ్లలోపు తొలి సమగ్ర కంటి పరీక్ష అవసరం. ఆ తర్వాత పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలనేది రెటీనా పరిస్థితి, షుగర్ నియంత్రణ ఆధారంగా వైద్యులు నిర్ణయిస్తారు. రెటీనాలో మార్పులు ఉన్నవారికి మరింత తరచుగా పరీక్షలు అవసరమవుతాయి. ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ (OCT) వంటి పరీక్షలతో రెటీనాలోని పొరలను వివరంగా పరిశీలించి, వాపు లేదా ద్రవం పేరుకుపోవడం వంటి మార్పులను గుర్తించవచ్చు. కాబట్టి చూపు బాగున్నా కంటి పరీక్షను వాయిదా వేయకూడదు.
డయాబెటిస్ ఉన్నవారు జాగ్రత్త
రక్తంలో చక్కెర స్థాయిలతో పాటు బీపీ, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రణలో ఉంచుకోవాలి. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. సమతుల ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ చేయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా కంటి పరీక్షలను డయాబెటిస్ చికిత్సలో భాగంగా భావించాలి. కళ్ల ముందు అకస్మాత్తుగా నల్లటి మచ్చలు కనిపించడం, చూపు మసకబారడం, తెరలా ఏదో అడ్డుగా కనిపించడం వంటి మార్పులు ఉంటే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. చూపు స్పష్టంగా ఉందని కళ్ల లోపల ఎలాంటి సమస్య లేదని అనుకోకూడదు. ముందుగానే గుర్తిస్తే చూపును కాపాడుకునే అవకాశాలు మెరుగుపడతాయి.




