Nagarkurnool: అభివృద్ధి, సంక్షేమ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ పాటిల్

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో 2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్, 2,500 ఎకరాల్లో కూరగాయల సాగు ప్రోత్సహించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 13 Nov 2026 9:34 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: అభివృద్ధి, సంక్షేమ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ పాటిల్

Nagarkurnool: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యానవన, విద్య, పశుసంవర్ధక, రోడ్లు–భవనాల శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, వివిధ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి, ప్రభుత్వ పథకాల అమలు తీరు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శాఖల వారీగా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనుల అమలులో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులతో శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న సివిల్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది హాజరును పర్యవేక్షించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి డిజిటల్ విద్యా వేదికలను విస్తృతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగంలో సమర్థవంతంగా ఉపయోగించుకుని విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డిఇఓ రమేష్ కుమార్ ను కలెక్టర్ ఆదేశించారు.

ఏఈడీపీ (AEDP) కోర్సుల అమలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు (GDC), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు (GPT)లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించే అంశాలపై కూడా సమీక్షించారు. విద్యార్థులకు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా, పరిశ్రమలు, ఉపాధి రంగాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా సంబంధిత శాఖలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

రోడ్లు–భవనాల శాఖ పరిధిలో జాతీయ రహదారులు (NH), భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని, ఆయా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ, అటవీశాఖ అనుమతులు, విద్యుత్ లైన్ల మార్పిడి, ఇతర మౌలిక సదుపాయాల తరలింపు (యుటిలిటీ షిఫ్టింగ్) వంటి అంశాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

రహదారి నిర్మాణ పనులు అనవసర జాప్యానికి గురికాకుండా అవసరమైన అనుమతులు, భూసేకరణకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేయాలని, ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక దృష్టి సారిస్తూ, పనులు నిర్దేశిత లక్ష్యాల మేరకు ముందుకు సాగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు అవసరమైన చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టిందని అందులో భాగంగానే నాగర్ కర్నూలు జిల్లాలో 2500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా 2500 ఎకరాల్లో కూరగాయల పంటల సాగుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి రైతులకు అవగాహన కల్పించి కూరగాయల సాగుకు ప్రోత్సహం కల్పించేలా ప్రణాళికలను అమలు చెయ్యాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి యశ్వంతరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం, నాగర్ కర్నూల్ ఆర్డీవో అర్చన, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞాన శేఖర్ నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL