Achampet: అచ్చంపేటలో సీఎం సభ వేళ కాంగ్రెస్ నేత లాలూ యాదవ్ ఫ్లెక్సీల చించివేత!
Achampet: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంత్రాల లాలూ యాదవ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చింపివేశారు.
Achampet: అచ్చంపేటలో సీఎం సభ వేళ కాంగ్రెస్ నేత లాలూ యాదవ్ ఫ్లెక్సీల చించివేత!
అచ్చంపేట: అచ్చంపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నేపథ్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల చించివేత కలకలం రేపింది. సభకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని రహదారులకు ఇరువైపులా పెద్ద ఎత్తున ఆకర్షణీయమైన ఫ్లెక్సీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. అయితే సాయినగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సాయినగర్ ఇన్ఛార్జ్ మంత్రాల లాలూ యాదవ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చింపివేశారు.
ఈ ఘటనపై మంత్రాల లాలూ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్చంపేట పట్టణంలో మిగతా నాయకులు కట్టిన ఫ్లెక్సీలన్నీ యథాతథంగా ఉన్నాయని, కేవలం తాను ఏర్పాటు చేసిన బ్యానర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చింపివేశారని ఆయన ఆరోపించారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తాను నిస్వార్థంగా పనిచేస్తున్నానని, తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కొందరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కూడా తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఇదే విధంగా కావాలని చింపివేశారని లాలూ యాదవ్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇలాంటి చౌకబారు చర్యలకు పాల్పడటం సరికాదని, దీని వెనుక ఎవరున్నారో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకత్వం, కార్యకర్తలు కోరుతున్నారు.




