Wanaparthy: కేంద్ర బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
Wanaparthy: కేంద్ర ప్రభుత్వ బీమా, పెన్షన్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. నాచహల్లిలో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు.
Wanaparthy: కేంద్ర బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
Wanaparthy: జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ బీమా, పెన్షన్ పథకాలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో గురువారం వనపర్తి మండలం నాచహల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక సమ్మిళిత పథకాల ప్రచార శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు వివిధ ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థిక భద్రతను పొందేందుకు ప్రభుత్వ బీమా, పెన్షన్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనవని తెలిపారు.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా సంవత్సరానికి కేవలం రూ.20 ప్రీమియం చెల్లించి రూ.2 లక్షల ప్రమాద బీమా రక్షణ పొందవచ్చని కలెక్టర్ వివరించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా సంవత్సరానికి రూ.436 ప్రీమియం చెల్లించి, బీమా నిబంధనలకు అనుగుణంగా మరణించిన సందర్భంలో రూ.2 లక్షల బీమా ప్రయోజనం పొందవచ్చని తెలిపారు.
అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అటల్ పెన్షన్ యోజన పథకంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా అర్హతలు, నిబంధనలకు అనుగుణంగా క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ, వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత పొందవచ్చని వివరించారు.
ఈ మూడు పథకాలు ప్రజల కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ వీటిలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే ఈ పథకాలలో చేరని వారు వెంటనే సమీప బ్యాంకు అధికారులను సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు.
ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పిన్ వంటి రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. బ్యాంకులు అందించే వివిధ సేవలపై అవగాహన పెంచుకోవడంతో పాటు, పొదుపు అలవాటును పెంపొందించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది ప్రజలకు వివిధ బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ బీమా పథకాలు, పెన్షన్ పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ఏజీఎం ప్రదీప్ చంద్ర, నాబార్డ్ డీడీఎం మనోహర్ రెడ్డి, ఎల్డీఎం శివకుమార్, డి ఎల్ పి ఓ రఘునాథ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అబ్దుల్లా, సంబంధిత అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




