Makthal: మహిళలకు ఉచిత బస్సు.. మగలకు భారీ వడ్డింపు.. బీజేపీ ఫైర్!

Makthal: మహిళలకు ఉచిత బస్సు పేరుతో పురుషులపై బస్సు చార్జీల భారం మోపుతున్నారని మక్తల్ బీజేపీ నేతలు మండిపడ్డారు.

Sowmya
Published on: 23 Nov 2026 4:56 PM IST
Makthal
X

Makthal: మహిళలకు ఉచిత బస్సు.. మగలకు భారీ వడ్డింపు.. బీజేపీ ఫైర్!

Makthal: మహిళలకు ఉచిత బస్సు పేరుతో చీటికిమాటికి బస్సు చార్జీలు పెంచుతూ ఆ మహిళల కుటుంబ యజమానుల జేబులకి కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లులు పెడుతోందని బిజెపి నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జి బలరాం రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకట రాములు ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలకు ఉచిత బస్సు ఆశ చూపి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేతకాక అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. సోమవారం మక్తల్ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

ఆదాయ వనరులు పెంపొందించుకునే మార్గాలు వెతుక్కోలేని ఈ ప్రభుత్వానికి చీటికిమాటికి బస్సు చార్జీలు పెంచే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మక్తల్ మండలంలోని జక్లేర్ స్టేజి నుంచి మక్తల్ పట్టణానికి కేవలం 13 కిలోమీటర్ల దూరం ఉందని, 13 కిలోమీటర్ల దూరానికి 60 రూపాయలు ఛార్జి వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అలాగే మక్తల్ నుంచి మహబూబ్ నగర్ కు గతంలో 90 రూపాయల టికెట్ ఉండగా ప్రస్తుతం 120 రూపాయలు వసూలు చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.

మక్తల్ నుంచి మహబూబ్ నగర్ పట్టణం 63 కిలోమీటర్ల దూరం ఉందన్నారు.జక్లేర్ నుంచి మహబూబ్నగర్ 50 కిలోమీటర్ల దూరం ఉంటే 80 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ఈ అడ్డగోలు చార్జీల విషయంలో ప్రయాణికులు కండక్టర్లతో గొడవ పడి ఊరుకుంటున్నారు తప్ప చేసేదేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలకు ఉచిత బస్సు పేరుతో పురుషులపై అధిక భారం మోపుతూ ఈ ప్రభుత్వం వారి నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని ఈ సమయంలో భారత్ సబ్మిట్ పేరుతో సమావేశాలు నిర్వహించి విదేశాస్తులను పిలిచి వారి ముందు దేశ పరువు తీసిన ఘనత రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు.

తెలివైన వారు ఎవరైనా ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని సునాయాసంగా నడుపుతారు తప్ప ఇలా అనవసరంగా దుబారా ఖర్చులు చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చరని అన్నారు. పేద ప్రజల గోడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదని మండిపడ్డారు.

ఎల్ ని నో ప్రభావంతో ఒకవైపు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం గొప్పలకు పోయి ఇలాంటి సమావేశాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. పెంచిన బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కర్ని స్వామి మక్తల్ మండల బిజెపి అధ్యక్షులు ఎం ప్రతాపరెడ్డి మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జావిద్ హుస్సేన్ మాజీ సర్పంచ్ మా దేవమ్మ శంకర్ ఓబిసి నాయకులు ఆడం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sowmya

Sowmya