డిజిటల్ జనగణనలో భాగస్వామ్యం కావాలి.. ‘స్వీయ గణన’కు నేడే చివరి అవకాశం!
జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
డిజిటల్ జనగణనలో భాగస్వామ్యం కావాలి.. ‘స్వీయ గణన’కు నేడే చివరి అవకాశం!
వికారాబాద్: సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సత్తార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్ నుండి ఎన్నెపల్లి చౌరస్తా వరకు మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, 2021లో జనగణన జరగాల్సింది ఉంది కానీ కోవిడ్ కారణంగా జరగలేదని, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి చేస్తున్న జనగణన ఇది 16వసారి, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని, మొదటి సారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
స్వీయగణన అనే విధానం తొలిసారి ప్రవేశపెట్టి జనగణన ప్రక్రియలో నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు. మీ కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే చేసుకునే అవకాశం స్వీయ గణన ద్వారా కల్పించారని, ఇందులో 34 ప్రశ్నలు ఉన్నాయని, కేవలం ఐదు నిమిషాల్లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. స్వీయ గణన కోసం https://se.census.gov.in సైట్ లో మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.
స్వీయగణన చేయడానికి ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకే గడువు అని, స్వీయ గణనలో పాల్గొని వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.
సోమవారం నుండి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని వెల్లడించారు. వారికి ప్రత్యేక ఐడీ కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు.
జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. అవగాహనా వాహనాన్ని ప్రారంభించారు. జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్మి నారాయణ, టి ఎం సి వెంకటేశ్వర్లు ,సహాయ సంచాలకులు రవి చంద్ర, ఫిజికల్ డైరెక్టర్ లు, టీచర్లు,ఎన్యూమరేటరులు,సూపర్ వైజర్లు, టెక్నీకల్ అసిస్టెంట్ లు, యువత పలు సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




