Narayanpet: భూ రీసర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి..కలెక్టర్!

Narayanpet: నారాయణపేట జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్‌లో భూ రీసర్వే పనులను కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 14 Oct 2026 4:04 PM IST
Narayanpet
X

Narayanpet: భూ రీసర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి..కలెక్టర్!

Narayanpet: నారాయణపేట జిల్లాలో చేపడుతున్న భూ రీసర్వే పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక రెవెన్యూ, సర్వే శాఖ అధికారులను ఆదేశించారు.

మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ప్రత్యేక సర్వే బృందాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను బుధవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిని సమీక్షించారు. నూతనంగా ఏర్పాటు చేసిన, శిక్షణ పొందిన సర్వే బృందాల సేవలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్‌లను ఆదేశించారు. రీసర్వే పనుల పురోగతిని జిల్లా యంత్రాంగం ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం రైతులతో మాట్లాడిన కలెక్టర్, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో భూ రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. భూముల కొలతలను కచ్చితత్వంతో చేపట్టి, భూహద్దులను స్పష్టంగా నిర్ధారించేందుకు ఆధునిక రోవర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. రీసర్వే ద్వారా భూ సరిహద్దుల నిర్ధారణతో పాటు రెవెన్యూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని, భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా నివారించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

వెంకటాపూర్ గ్రామంలో 640 ఎకరాల భూమి ఉంది అని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఫౌండేషన్ ప్రకారం రీసర్వే నిర్వహించి, 108 మందికి ఫారం-11 జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్లాస్పూర్ గ్రామంలో 24 మందికి సంబంధించి రీసర్వే ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు.

సర్వే బృందాల్లో పనిచేస్తున్న చైన్‌మెన్ల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకోగా, ప్రస్తుతం 24 మంది చైన్‌మెన్లు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిర్దేశించిన పనులన్నింటినీ రాబోయే 20 రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

భూ రీసర్వే ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు రైతులు, గ్రామస్థులు సర్వే సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీ వేణుగోపాల్ రెడ్డి, తహసీల్దార్ రామ్‌కోటి, రెవెన్యూ, సర్వే శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA