Wanaparthy: వనపర్తి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా!
Wanaparthy: వనపర్తి కలెక్టరేట్ ఎదుట మంత్రులు పొంగులేటి, జూపల్లి, శ్రీహరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత.
Wanaparthy: వనపర్తి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా!
Wanaparthy: ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ వనపర్తి గడ్డపై సమరశంఖం పూరించింది. ‘ఎలక్షన్ చోర్ ఆఫ్ ఇండియా’ నినాదంతో సోమవారం వనపర్తి సమీకృత కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా లో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలతో పాటు క్రీడలు–యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్రంగా స్పందించారు.
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజల తీర్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఓట్ల చోరీకి సంబంధించిన అంశాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆధారాలతో దేశ ప్రజల ముందుంచుతున్నారని తెలిపారు.
ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, SIR ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపునకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి అన్నారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌పై చర్యలు తీసుకుని, ఆయనను పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని మంత్రి పొంగులేటి డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిందేనని స్పష్టం చేశారు. ఓటు హక్కును దెబ్బతీసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో అడ్డుకుంటుందని జూపల్లి పేర్కొన్నారు.
“ఓటర్ల జాబితాతో రాజకీయ ఆటలు వద్దు”
అర్హత ఉన్న ఒక్క ఓటును కూడా తొలగించొద్దు: మంత్రి వాకిటి శ్రీహరి. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. SIR పేరుతో అర్హులైన ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.
ప్రజల చేతిలో ఉన్న ఓటు వజ్రాయుధం లాంటిదని ఆ ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని శ్రీహరి స్పష్టం చేశారు.
“ఓటు హక్కుపై కుట్రలను తిప్పికొడతాం”
జ్ఞానేశ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఓటర్ల జాబితా ప్రక్రియను అడ్డుపెట్టుకుని అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలిగించే చర్యలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలని, ఎన్నికల సంఘంలో పారదర్శకతను మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని మేఘారెడ్డి స్పష్టం చేశారు.
“ఓటు హక్కును హరిస్తే ఊరుకోం”
డీసీసీ అధ్యక్షుడు శివసేనరెడ్డి నేతృత్వంలో నిరసన డీసీసీ అధ్యక్షుడు శివసేనరెడ్డి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని, ఓటర్ల జాబితాలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.
కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని, అర్హత కలిగిన ప్రతి యువకుడికి ఓటు హక్కు కల్పించాలని శివసేనరెడ్డి కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, యువతకు చెందిన అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలిగించే చర్యలను కాంగ్రెస్ సహించబోదని స్పష్టం చేశారు.
అనంతరం నిరసన కార్యక్రమంలో లేవనెత్తిన అంశాలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనరెడ్డి తదితరులు అందజేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల–పట్టణ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎస్సీ, మైనార్టీ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




