Nagarkurnool: మురాసు తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

Nagarkurnool: మురాసు తుపాను ప్రభావంతో నాగర్‌కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు, 90 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 1 Nov 2026 10:17 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: మురాసు తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

Nagarkurnool: భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన హెచ్చరికల ప్రకారం మురాసు తుపాను ప్రభావంతో నాగర్‌కర్నూల్ జిల్లాలో నవంబర్ 2వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి నవంబర్ 3వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. నవంబర్ 3, 4 తేదీల్లో ఎల్లో అలర్ట్ ఉన్నట్లు పేర్కొన్నారు.

మురాసు తుపాను నవంబర్ 2వ తేదీ రాత్రి 11:30 గంటల నుంచి నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున 4 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించినట్లు తెలిపారు. నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం నుంచి ఈదురుగాలుల తీవ్రత పెరిగి, రాత్రి నుంచి నవంబర్ 3వ తేదీ మధ్యాహ్నం వరకు గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ల కింద ఆశ్రయం పొందవద్దని, పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని తెలిపారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

అత్యవసర సేవల కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 08540- 230201 నెంబర్కు సంప్రదించాలని కోరారు. జిల్లా ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కోరారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL