Kadthal: పెట్టుబడులను అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు: డీసీసీ ఉపాధ్యక్షుడు!

Kadthal: దక్షిణ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 10 Sept 2026 11:04 PM IST
Kadthal
X

Kadthal: పెట్టుబడులను అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు: డీసీసీ ఉపాధ్యక్షుడు!

కడ్తాల్‌: ఫ్యూచర్‌ సిటీ ఏర్పాటుతో దక్షిణ తెలంగాణ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, దీనిని ఓర్వలేక బీఆర్‌ఎస్‌ నాయకులు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, తద్వారా ఈ ప్రాంత యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. అలాంటి పెట్టుబడులను అడ్డుకునేలా కేటీఆర్‌ బెదిరింపు ధోరణితో వ్యవహరించడం అభివృద్ధికి విఘాతం కలిగించడమేనని అన్నారు.

కడ్తాల్‌ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించినా ఆ పార్టీ నేతల అహంకార ధోరణిలో మార్పు రాలేదన్నారు. ఫ్యూచర్‌ సిటీ భవిష్యత్తులో ఉండదంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఈ ప్రాంత ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దక్షిణ తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని, ప్రపంచస్థాయి మౌలిక వసతులతో ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో కాలుష్యకారక, విషపూరిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రయత్నించిందని శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పర్యావరణం, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఫ్యూచర్‌ సిటీ వంటి ఆధునిక అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఫ్యూచర్‌ సిటీతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు, ఐటీ సంస్థలు, సేవా రంగాలు విస్తరించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న కేటీఆర్‌ ఆశలు పగటి కలలేనని శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో కాలుష్య పరిశ్రమల విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు స్వార్థ ప్రయోజనాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను భయపెట్టే ప్రయత్నాలు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని అన్నారు.

ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రగతికి ఆటంకంగా మారుతున్న బీఆర్‌ఎస్‌ రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story