Mahabubnagar: వెయ్యి రోజుల్లో దేవరకద్ర రూపురేఖలు మార్చాం ఎమ్మెల్యే!

Mahabubnagar: కాంగ్రెస్ ప్రజా పాలన 1000 రోజుల్లో దేవరకద్ర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 4 Sept 2026 11:50 AM IST
Mahabubnagar
X

Mahabubnagar: వెయ్యి రోజుల్లో దేవరకద్ర రూపురేఖలు మార్చాం ఎమ్మెల్యే!

Mahabubnagar: కాంగ్రెస్ ప్రజాపాలన వెయ్యి రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా చిన్న చింతకుంట, కౌకుంట్ల దేవరకద్ర మండలాలలో నిర్వహించిన భారీ సంబరాలు, బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...గత బీఆర్‌ఎస్‌ పాలనలో దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హయాంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.

బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటుకు 416 ఎకరాల భూమిని ఉచితంగా రక్షణ శాఖకు ఇస్తున్నట్లు తెలియజేశారు. బ్రహ్మోస్‌ యూనిట్ దేవరకద్రకు వస్తే మన ప్రాంత రూపురేఖలు మారడంతో పాటు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేవరకద్ర లో 100 పడకల ఆసుపత్రి, కోర్టు ఏర్పాటు చేసాం, దేవరకద్రను మున్సిపాలిటీగా చేశాం.

విద్య పరంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీసం దేవరకద్ర నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్, చిన్నచింతకుంట మండలంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయలేదని, మన ప్రజా ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో దేవరకద్రలో డిగ్రీ కాలేజ్, చిన్నచింతకుంట లో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేశామని తెలిపారు .

రైల్వే/రోడ్డు మార్గం కారణంగా దేవరకద్ర ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు అండర్‌పాస్‌ ఏర్పాటుకు అధికారులతో నిరంతరం చర్చలు జరిపి దేవరకద్ర కు సబ్వే మంజూరు చేయించామని తెలిపారు, త్వరలో సబ్వే నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలియజేశారు.

పదేళ్ల బిఆర్ఎస్ పాలన లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, చిన్న చింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

నియోజకవర్గంలో 28 వేల రేషన్‌ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చామని, ఒక్క దేవరకద్ర పట్టణంలోనే 77 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు.

పదేళ్లపాటు అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేసింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, దళితులకు మూడెకరాల భూమి, ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు వంటి హామీలను అమలు చేయకుండా బీఆర్‌ఎస్ ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను నెరవేర్చిందని తెలిపారు.

ఇచ్చిన మాట మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా 21 వేల కోట్ల రూపాయలతో 25 లక్షల మంది రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.

ప్రజలు గత పాలనను, ప్రస్తుత పాలనను బేరీజు వేసుకొని ఎంపీ, గ్రామ పంచాయతీ మరియు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నచింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA