Nagarkurnool: సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై నాగర్‌కర్నూల్ కలెక్టర్ సమీక్ష
Nagarkurnool: డిండి ఎత్తిపోతల పథకం భూసేకరణ, పెగ్ మార్కింగ్, ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియలను జాప్యం లేకుండా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
Nagarkurnool: సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై నాగర్‌కర్నూల్ కలెక్టర్ సమీక్ష
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతం చేసి, అవసరమైన భూములకు పెగ్ మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పెగ్ మార్కింగ్, పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డిండి ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూముల వివరాలు, ఇప్పటివరకు చేపట్టిన భూసేకరణ, పెగ్ మార్కింగ్ పురోగతి, ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పెండింగ్ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
ప్రాజెక్టుకు అవసరమైన భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి హద్దులను స్పష్టంగా నిర్ధారించి పెగ్ మార్కింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో ఏవైనా సమస్యలు లేదా అభ్యంతరాలు ఉంటే వాటిని వెంటనే గుర్తించి, సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.
అదేవిధంగా భూసేకరణకు సంబంధించి పరిహారం చెల్లింపు, పునరావాసం మరియు పునరావాస పునరుద్ధరణ (ఆర్‌అండ్‌ఆర్) చర్యలను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన భూ నిర్వాసితులకు నిబంధనల మేరకు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణలో వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత సమయంలోగా ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. సమీక్షలో ఈఈలు, డీఈఈలు, ఏఈఈలు, రెవెన్యూ, సాగునీటి శాఖలకు చెందిన సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




