Gadwal: పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన మనందరి బాధ్యత: సురేంద్రమోహన్!
Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ సురేంద్రమోహన్ సమీక్ష నిర్వహించారు.
Gadwal: పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన మనందరి బాధ్యత: సురేంద్రమోహన్!
గద్వాల్: కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేసి పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు సంబంధిత అధికారులతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ సహకరించాలని వ్యవసాయ, సహకార శాఖల రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరోల్ అబ్జర్వర్ సురేంద్రమోహన్ అన్నారు.
గురువారం ఐడిఓసి సమావేశపు మందిరంలో ఎస్ఐఆర్ పై జిల్లా ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి పరిశీలకులు ప్రసంగించారు. అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లు ఓటరుగా నమోదు కావడానికి ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి సమర్పించాల్సి ఉంటుందన్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా కాపీలను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసినందున బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారంతో క్షేత్రస్థాయిలో సంబంధిత ఎన్నికల అధికారులకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఎస్ఐఆర్ కు సంబంధించి ఇది మొదటి పర్యటన గా పేర్కొంటూ, మరో పర్యటనలో పోలింగ్ స్టేషన్లను కూడా సందర్శిస్తూ, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అప్పట్లోగా జిల్లా ఎన్నికల అధికారులు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తూ ముందుకెళ్లాలని ఈ సందర్భంగా పరిశీలకులు పేర్కొన్నారు.




