Gadwal: చదువుతోపాటు కళల్లో రాణించాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా
Gadwal: ఢిల్లీ జాతీయ సదస్సులో ప్రతిభ చాటిన గద్వాల బాల భవన్ విద్యార్థులను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఐడీవోసీలో ప్రత్యేకంగా అభినందించారు.
Gadwal: చదువుతోపాటు కళల్లో రాణించాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా
Gadwal: ఢిల్లీలో ప్రదర్శనలిచ్చిన బాల భవన్ విద్యార్థులకు కలెక్టర్ అభినందన. విద్యార్థులు చదువుతోపాటు సంగీత, నృత్య, చిత్రలేఖన తదితర కళా రంగాల్లోనూ రాణించడం ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు..గద్వాల బాల భవన్ విద్యార్థులు అనన్య, సుస్వర ప్రియ, సాహితీప్రియ, పూజ్యశ్రీత అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మూడు రోజులపాటు నేషనల్ బాల భవన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన జాతీయ బాలల సదస్సు, ఏకీకరణ శిబిరంలో పాల్గొని తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఎస్కార్ట్ గా వెళ్ళిన వాయిద్య శిక్షకులు బోడ శంకర్ ను గురువారం ఐడిఓసిలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీలో విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనల గురించి, అక్కడ ఇతర రాష్ట్రాల విద్యార్థులతో వారి అనుభవాలు తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మన దేశంలో విభిన్న భాషలు మాట్లాడే, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన ప్రజలు జీవిస్తున్నప్పటికీ మనమంతా భారతీయులమే కాబట్టి కలిసి మెలిసి జీవిస్తున్నామని తెలిపారు.
ఢిల్లీలో జరిగిన ఏకీకరణ శిబిరం ముఖ్య ఉద్దేశం కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించడమేనని పేర్కొన్నారు. అక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి భిన్న కళా రంగాల్లో రాణిస్తున్న విద్యార్థులు రావడంతో అందరిలో స్నేహ సంబంధాలు పెంపొందించబడతాయని చెప్పారు.




