Narayanpet: ఎత్తిపోతల భూసేకరణను వేగవంతం చేయాలి కలెక్టర్ ప్రియాంక!
Narayanpet: మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల భూసేకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను నారాయణపేట జిల్లా కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక ఆదేశించారు.
Narayanpet: ఎత్తిపోతల భూసేకరణను వేగవంతం చేయాలి కలెక్టర్ ప్రియాంక!
Narayanpet: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి . హెచ్ ప్రియాంక రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి తహసీల్దార్లతో భూసేకరణ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూసేకరణకు సంబంధించి రైతులతో ఉన్న సమస్యలను గుర్తించి, వారితో చర్చించి పరిష్కార మార్గాలను ఖరారు చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రతిపాదనలు, పరిహారం చెల్లింపులు, సర్వే నంబర్లకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. అవసరమైన చోట రైతులను పిలిపించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించి, నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎత్తిపోతల పథకానికి సంబంధించి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, ఆక్రమణలు లేని భూములు, భూముల స్థితిగతులు, సర్వే వివరాలపై తహసీల్దార్లు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. భూసేకరణకు అనువైన భూములను గుర్తించి, అవసరమైన ప్రతిపాదనలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. రానున్న రోజుల లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించే అవకాశం ఉన్నందున, భూములకు సంబంధించిన రికార్డులు, వివరాలు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు.
రేడియల్ రోడ్డు భూసేకరణ పనులను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి, క్షేత్రస్థాయిలో సంబంధిత బృందాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రహదారి పనులకు ఆటంకం కలగకుండా పెండింగ్ సమస్యలను పరిష్కరించి, పనుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లు సమన్వయంతో పనిచేసి, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు.
అలాగే, పెండింగ్లో ఉన్న భూసేకరణ అవార్డులు, పరిహారం చెల్లింపులు, సర్వేకు సంబంధించిన అంశాలను సమీక్షించి, అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు.
భూసేకరణ పనుల పురోగతిపై వచ్చే వారం మరోసారి సమీక్ష నిర్వహిస్తామని, అప్పటిలోగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఆర్డీవో రమేష్, ఏవో అనిల్ కుమార్, ల్యాండ్ సర్వే ఏడీ వేణుగోపాల్ రెడ్డి, నారాయణ పేట, ఉట్కూర్, దామరగిద్ద, మద్దూరు, గుండుమల్ , కోస్గి మండలాల తహసీల్దార్లు అమరేంద్ర కృష్ణ, అశోక్ కుమార్, తిరుపతయ్య, మహేష్, భాస్కర స్వామి, కళ్యాణి, సంబంధిత రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




