Achampet: గుడులు, రోడ్లకు కోట్లు.. పేద పిల్లల చదువులకు నిధులేవి?: ఏఐఎస్ఎఫ్ ఫైర్!

Achampet: అచ్చంపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలను విస్మరించారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బలముల ప్రేమ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 27 Nov 2026 3:39 PM IST
Achampet
X

Achampet: గుడులు, రోడ్లకు కోట్లు.. పేద పిల్లల చదువులకు నిధులేవి?: ఏఐఎస్ఎఫ్ ఫైర్!

నాగర్‌కర్నూల్ జిల్లా: అచ్చంపేటలో నవంబర్ 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రకటనలు జరిగాయి. అయితే ఈ ప్రాంతంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కనీసం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం బాధాకరమని AISF తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బలముల ప్రేమ్ కుమార్ విమర్శించారు.

సీఎం సభలో రోడ్ల అభివృద్ధికి రూ.274 కోట్లకు పైగా నిధులు, అచ్చంపేట మున్సిపల్ అభివృద్ధికి రూ.25 కోట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.18 కోట్లు ప్రకటించారు. అభివృద్ధి పనులను తాము వ్యతిరేకించడం లేదని, కానీ విద్యారంగంలో నెలకొన్న అసలు సమస్యలకు పరిష్కారం చూపకుండా కేవలం భవనాల నిర్మాణాలతోనే విద్యాభివృద్ధి సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు.

ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మరోవైపు తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, ప్రయోగశాలలు, గ్రంథాలయాల వంటి కనీస సదుపాయాల కొరత విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. 130 అదనపు తరగతి గదులు నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం వాటిలో బోధించడానికి అవసరమైన ఉపాధ్యాయులను ఎప్పుడు నియమిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి 75 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించడం మంచిదేనని, కానీ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల కోసం కళాశాలల చుట్టూ తిరిగే పరిస్థితిని ప్రభుత్వం వెంటనే మార్చాలని, విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేసే సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు ఎప్పుడు విడుదల చేస్తారు? ఖాళీ టీచర్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు? అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రత్యేక నిధులు ఎప్పుడు కేటాయిస్తారు? ప్రతి పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు ఎప్పుడు కేటాయిస్తారని AISF తరఫున ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

గుడులు నిర్మించండి.. రోడ్లు వేయండి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి. కానీ అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయండి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించండి. విద్యార్థుల భవిష్యత్తును రాజకీయ ప్రకటనలకు పరిమితం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఒక రోడ్డు ఒక ప్రాంతాన్ని కలుపుతుంది.. ఒక పాఠశాల ఒక తరాన్ని తీర్చిదిద్దుతుంది అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే AISF ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని బలముల ప్రేమ్ కుమార్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో AISF అచ్చంపేట నియోజకవర్గ నాయకులు ఫన్నీ, చరణ్, సంతోష్, సంగీత్, చందు, లక్ష్మాపురం రాజు తదితరులు పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA