Gadwal: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి
Gadwal: జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.
Gadwal: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి
గద్వాల్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ, అనామిలిస్ జాబితాలో ఉన్న వారందరికీ నోటీసులు పంపించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని 79-గద్వాల, 80-అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించడమే కాక తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 27న జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలను నిర్వహించామన్నారు. ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా నిర్వహించిన ఈ సభల్లో ముసాయిదా ఓటరు జాబితాలోని ఓటర్ల వివరాలు, నోటీసుల పంపిణీ, తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. సంబంధిత బిఎల్ఓలు, సూపర్‌వైజర్లు, ఇతర ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారంతో జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు.
జిల్లాలోని మొత్తం 594 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 1,49,281 నోటీసులు జనరేట్ చేయడం పూర్తయిందన్నారు. ఇప్పటివరకు 11,385 నోటీసులు పంపిణీ చేయగా, 1,37,896 నోటీసులు పంపిణీ చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నోటీసుల పంపిణీ శాతం 7.63గా నమోదైనట్లు పేర్కొన్నారు.
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో 303 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 78,338 నోటీసులు జనరేట్ చేయగా, 4,445 మందికి ఇప్పటివరకు నోటీసులు పంపిణీ చేశారన్నారు. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 291 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 70,943 నోటీసులు జనరేట్ చేయగా, 6,940 నోటీసులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మండలాల వారీగా కేటీ దొడ్డి 23.62%తో అత్యధిక నోటీసుల పంపిణీ శాతం నమోదు చేయగా, ఇటిక్యాల 16.30%, ఎర్రవల్లి 14.42%, ఐజ 12.33%తో తదుపరి స్థానాల్లో ఉన్నాయన్నారు.
గ్రామ, వార్డు సభల ద్వారా ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, నోటీసులు అందుకున్న ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఓటు హక్కును కాపాడుకునేందుకు అవసరమైన పత్రాలను సమర్పించి ఎన్నికల అధికారులకు సహకరించాలని కోరారు. నిర్దేశిత తేదీల్లో ఎన్నికల సంఘం సూచించిన ఏవేని 11 గుర్తింపు కార్డులతో హియరింగ్ కు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. పెండింగ్ నోటీసుల పంపిణీని వేగవంతం చేసి, పోలింగ్ స్టేషన్ ల వారీగా పురోగతిని పర్యవేక్షించాలని సంబంధిత ఈఆర్వో లు, ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు, బిఎల్ఓ లను ఆదేశించినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.




