Nagarkurnool: చుక్కాయిపల్లి చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపన!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని చుక్కాయిపల్లి చెరువును రూ.6.5 కోట్లతో మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసే పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు.
Nagarkurnool: చుక్కాయిపల్లి చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపన!
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని చుక్కాయిపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పర్యాటక శాఖ ఆద్వర్యంలో రూ.6.5 కోట్ల నిధులతో చేపట్టనున్న సుందరీకరణ పనులకు పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొల్లాపూర్ ప్రాంతానికి చుక్కాయిపల్లి చెరువు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. చెరువు పరిసరాలను సుందరీకరించి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రాష్ట్రంలోని ప్రకృతి అందాలు, జలవనరులు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ ప్రాంతానికి పర్యాటకంగా మరింత గుర్తింపు తీసుకురావడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
చుక్కాయిపల్లి చెరువు మినీ ట్యాంక్ బండ్‌గా రూపుదిద్దుకుంటే కొల్లాపూర్ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రం అందుబాటులోకి రానుంది. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే పట్టణ సుందరీకరణకు మరింత వన్నె చేకూరనుంది.




