Kothakota: పాదయాత్రగా వచ్చి శ్రీ అంబా భవానీ మాతను దర్శించుకున్న భక్తులు

Kothakota: అడ్డాకుల నుంచి పాదయాత్రగా వచ్చిన భవానీ దీక్షాధారులు కొత్తకోట శ్రీ అంబా భవానీ మాతను దర్శించుకుని శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA
Published on: 18 Oct 2026 5:17 PM IST
Kothakota
X

Kothakota: పాదయాత్రగా వచ్చి శ్రీ అంబా భవానీ మాతను దర్శించుకున్న భక్తులు

కొత్తకోట: భక్తిశ్రద్ధలతో భవానీ మాలధారణ చేసి, పాదయాత్రగా కొత్తకోట శ్రీ అంబా భవానీ మాతను దర్శించుకున్నారు అడ్డాకుల మండల కేంద్రానికి చెందిన భవానీ దీక్షాధారులు.

శరదృతువులో ఆశ్వయుజ మాసంలో నిర్వహించే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని, మానసిక ప్రశాంతతను అందిస్తాయని భక్తుల విశ్వాసం. కామ, క్రోధ, లోభ, మోహాలను విడనాడి, అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో జీవించాలనే సంకల్పంతో భక్తులు భవానీ మాలధారణ చేసి దీక్ష చేపడతారు.

ఈ నేపథ్యంలో అడ్డాకుల గ్రామంలోని శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయంలో ప్రాతఃకాల పూజలు ముగించుకున్న భవానీ దీక్షాధారులు అక్కడి నుంచి కొత్తకోటలోని త్రిశక్తి స్వరూపిణి శ్రీ అంబా భవానీ మాత ఆలయం వరకు పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు స్వీకరించి, తమ కుటుంబాలతో పాటు గ్రామ ప్రజలు, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.

పాదయాత్రగా వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహక సభ్యులు పొగాకు అనిల్ స్వాగతం పలికారు. అనంతరం భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించి, అమ్మవారి మంగళహారతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఆలయ అర్చకులు సురేష్ శాస్త్రి , నవీన్ , సదాశివయ్య , ఆనందయ్య , శ్రీకాంత్ గార్లు భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు.

అమ్మవారిని దర్శించుకొని, పూజల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక తృప్తిని కలిగించిందని అడ్డాకుల గ్రామ భవానీ దీక్షాధారులు సంతోషం వ్యక్తం చేశారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA

B. KISHORE KUMAR, KOTTHAKOTA