Maganoor: మాగనూర్ పెద్దవాగు ఇసుక దోపిడీని అరికట్టాలి బీజేపీ నేత కొండయ్య
Maganoor: మాగనూర్ పెద్దవాగు అక్రమ ఇసుక రవాణాపై బీజేపీ నేత కొండయ్య మండిపాటు. 16 గ్రామాల రైతులకు న్యాయం చేయాలని, ఇసుక మాఫియాపై చర్యలకు డిమాండ్.
Maganoor: మాగనూర్ పెద్దవాగు ఇసుక దోపిడీని అరికట్టాలి బీజేపీ నేత కొండయ్య
మాగనూర్: మాగనూర్ పెద్దవాగు నుంచి ఇసుక దోపిడీని అరికట్టి భూగర్భ జలాలను కాపాడాలని, ఆ వాగు నీటిపై ఆధారపడి రెండు పంటలు పండించుకునే రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య డిమాండ్ చేశారు.
బీజేపీ బృందంతో కలిసి ఆయన ఈరోజు దాసరి దొడ్డి వద్ద గల పెద్దవాగును పరిశీలించారు. దాసరి దొడ్డికి చెందిన ఒక వ్యక్తి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ఇసుకను దోచుకున్నాడని, ఇప్పుడు అదే వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ రాత్రి, పగలు తేడా లేకుండా వందలాది టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నాడని అన్నారు.
ఇసుక దోపిడీదారులు జాతీయ రహదారి మీదుగా అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు తక్షణమే స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒకప్పుడు బంగారు వర్ణంలో దగదగా మెరిసే ఇసుకతో కళకళలాడిన పెద్దవాగు నేడు ఇసుక దోపిడీ వల్ల మొరం, మట్టి తేలి, పిచ్చి మొక్కలతో నిండిపోయిందని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాగుపై ఆధారపడి 16 గ్రామాల రైతులు హ్యాండ్ బోర్లు, బావుల ద్వారా రెండు పంటలు పండించుకునేవారని, నేడు భూగర్భ జలాలు అడుగంటడంతో ఒక్క పంట కూడా పండించుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ఇప్పటికైనా మంత్రి, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక దోపిడీని పూర్తిగా అరికట్టి రైతులకు న్యాయం చేయాలని కొండయ్య డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: బీజేపీ ఓబీసీ అధికార ప్రతినిధి శంకరుల రవికుమార్, కల్లూరి నాగప్ప, మల్లికార్జున్, మున్సిపల్ కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి, నారాయణ, చిట్యాల లక్ష్మణ్, ప్రతాపరెడ్డి, విద్యాసాగర్, అశోక్ గౌడ్, బ్యాటరీ రాజు, కానాపురం రాములు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




