Gudur: గూడూరులో అక్రమ మట్టి మాఫియాపై రైతుల సమరభేరి: తహసిల్దార్ కార్యాలయం ముట్టడి..
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో అక్రమ మట్టి రవాణాకు వ్యతిరేకంగా రైతులు తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తవ్వకాలను అడ్డుకున్న తమపై జేసీబీ యాజమాన్యం దాడి చేసిందని తహసిల్దార్ కోమలకు ఫిర్యాదు చేశారు.
గూడూరు (మహబూబాబాద్ జిల్లా): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిధిలోని స్థానిక చెరువుల నుండి రాత్రికి రాత్రే సాగుతున్న అక్రమ మట్టి రవాణాను తక్షణమే అడ్డుకోవాలని కోరుతూ స్థానిక రైతులు శనివారం గూడూరు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ తహసిల్దార్ కోమల కు వినతి పత్రం సమర్పించారు.
గత కొంతకాలంగా కొంతమంది స్వార్థపరులు ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా చెరువుల్లోని మట్టిని జేసీబీలతో తవ్వి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల చెరువుల ఉనికి ప్రమాదంలో పడటమే కాకుండా, రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మట్టి రవాణా ద్వారా తమ పంట పొలాలు ధ్వంసం అవుతున్నాయని, హద్దులు చెరిగిపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులలో మట్టి తవ్వకాలను చెయ్యకూడదని జెసిబి యాజమాన్యాన్ని ప్రాధేయపడినా రైతులకు జెసిబి యజమాన్యులు రైతులపై దాడి చేస్తూ నానా బూతులు తిట్టారు అని మమ్ములను బెదిరిస్తున్నారు అంటూ తహసిల్దార్ ముందు మొరపెట్టుకున్నారు. మాపై దాడికి పాల్పడి మమ్ములను బెదిరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతుల ప్రధాన డిమాండ్లు
చెరువుల్లో అక్రమ తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలి.
నిబంధనలు ఉల్లంఘించి మట్టిని రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేయాలి.
అక్రమార్కులకు సహకరిస్తున్న స్థానిక అధికార పార్టీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అని డిమాండ్ చేశారు.
తహసిల్దార్ మాట్లాడుతూ...
ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అక్రమంగా మట్టి తరలిస్తే ఎంతటి వారైనా సరే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, త్వరలోనే ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తామని రైతులకు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక రైతు సంఘం నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామాల రైతులు పాల్గొన్నారు.




