Mahabubnagar: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తాం!

Mahabubnagar: మహబూబ్‌నగర్ న్యూటౌన్ ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాలలో మైనారిటీ సంక్షేమ నిధులు రూ.50 లక్షలతో నిర్మించనున్న బహుళ ప్రయోజన భవనానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Published on: 25 Nov 2026 2:35 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తాం!

Mahabubnagar: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌లోని న్యూటౌన్ లో గల ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాల లో మైనారిటీ సంక్షేమ నిధులు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న బహుళ ప్రయోజన భవనానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొత్త భవనంలో అవసరమైన తరగతి గదులు ఏర్పాటు చేయడంతో పాటు, కంప్యూటర్ లెర్నింగ్ సెంటర్, ప్రయోగశాల, భవిష్యత్తులో అదనపు అంతస్తు గ్రంథాలయం వంటి సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు.

ఈ పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు చదువుకోవడం, వారిలో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు కావడం అభినందనీయమన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లించలేని కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొన్ని పాఠశాలలు, హాస్టళ్లకే పరిమితం కాకుండా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

అవసరమైన బోధనా సిబ్బందిని అందుబాటులో ఉంచినప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొంటూ, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కల్పించడం అత్యంత ముఖ్యమని, ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలని సూచించారు. సరైన మార్గదర్శకత్వం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఉంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు.

మహబూబ్‌నగర్‌లో విద్యార్థుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న విద్యా వాలంటీర్ల వ్యవస్థ మంచి ఫలితాలను ఇస్తోందని తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నారా, చదువుపై దృష్టి పెడుతున్నారా అనే అంశాలను వాలంటీర్లు పర్యవేక్షిస్తూ, వారికి మార్గనిర్దేశం చేస్తున్నారని వివరించారు. యువత విద్యా వాలంటీర్లుగా సేవలందిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు.

గత ఏడాది ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల్లో సుమారు 150 మంది ఇంజినీరింగ్, వైద్య, వెటర్నరీ, వ్యవసాయ, బీ-ఫార్మసీ, డీ-ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందడం సంతోషకరమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు సరైన ప్రోత్సాహం అందిస్తే వారు ఉన్నత విద్యలోనూ రాణించగలరని అన్నారు. పదో తరగతి విద్యార్థులు రాబోయే నాలుగైదు నెలలు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. సెల్‌ఫోన్లు, రీల్స్‌తో విలువైన సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని అన్నారు. పదో తరగతిలో ఏర్పడే విద్యా పునాది భవిష్యత్తులో ఉన్నత విద్యకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, కార్పొరేటర్లు షబ్బీర్ అహ్మద్, అవేజ్, ఉమర్ కొత్వాల్, తాహేర్, విట్టల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.