Makthal: పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం: సీఐ రామ్ లాల్!
Makthal: మక్తల్ పీఎస్లో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. సీఐ రామ్ లాల్ పోలీసు విధులు, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.
Makthal: పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం: సీఐ రామ్ లాల్!
మక్తల్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మక్తల్ పోలీస్ స్టేషన్లో సీఐ రామ్ లాల్, మక్తల్ ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రామ్ లాల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు.
ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు, నేరాల నియంత్రణలో పోలీసుల పాత్ర, చట్టాల అమలు, ప్రజలకు అందించే పోలీస్ సేవల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు పోలీస్ శాఖ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు, చట్టాల పట్ల గౌరవం కలిగి ఉండాలని, క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులకు స్పందించవద్దని విద్యార్థులకు సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, చెడు అలవాట్లకు లోనుకాకుండా లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని తెలిపారు. ఏదైనా సమస్య ఎదురైతే భయపడకుండా పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ-2 రేవతి, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




