Makthal: మక్తల్‌లో వీధి కుక్కల స్వైరవిహారం భయాందోళనలో ప్రజలు!

Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వీధి కుక్కల స్వైరవిహారం. పాఠశాల విద్యార్థులు, ప్రజలు తీవ్ర భయాందోళన. మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

B. NARENDER, MAKTHAL
Published on: 8 Nov 2026 11:07 AM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో వీధి కుక్కల స్వైరవిహారం భయాందోళనలో ప్రజలు!

Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని సంగంబండ రోడ్డు, భారతీయ విద్యానికేతన్ స్కూల్ పరిసర ప్రాంతంలో గత కొంతకాలంగా వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. కుక్కలు గుంపులుగా తిరుగుతూ రోడ్డు మీద స్వైర విహారం చేస్తుండటంతో చుట్టుపక్కల నివసించే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ముఖ్యంగా స్కూల్‌కు వచ్చే చిన్నారులు, విద్యార్థులు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్‌కు వెళ్లే సమయంలో, స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో కుక్కలు విద్యార్థుల వెంటపడటం, గుంపులుగా రోడ్లపై తిరగడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా పంపించడానికి కూడా భయపడుతున్నారు.

ఇది కేవలం వీధి కుక్కల సమస్యగా కాకుండా ప్రజల ప్రాణ భద్రతకు సంబంధించిన తీవ్రమైన సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు మరియు ద్విచక్ర వాహనదారులకు కుక్కల గుంపుల సంచారం ప్రమాదకరంగా మారుతోంది. కుక్కల భయంతో వాహనదారులు అకస్మాత్తుగా బ్రేకులు వేయడం లేదా దారి మార్చడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.

అధికారుల తక్షణ చర్య అవసరం

ఈ సమస్యపై మక్తల్ మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి మక్తల్ మున్సిపల్ కేంద్రంలోని, సంగంబండ రోడ్డు మరియు భారతీయ విద్యానికేతన్ స్కూల్ పరిసరాల్లో వీధి కుక్కలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కుక్కల సంఖ్యను గుర్తించి, నిబంధనల ప్రకారం Animal Birth Control (ABC) కార్యక్రమం అమలు చేయాలని, రోడ్డు, స్కూల్ పరిసర ప్రాంతాలను పరిశీలించి సమస్య తీవ్రతను అడ్డుకట్ట వేయాలని మక్తల్ ప్రజలు కోరుకుంటున్నారు.

మున్సిపల్ అధికారులు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను నమోదు చేసి, సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలనీ సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పాటుకు ఆశిస్తున్నారు. ఒక పాఠశాల సమీపంలోనే విద్యార్థులు భయంతో రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరం.

విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని మక్తల్ ప్రజలు కోరుతున్నారు.

కాబట్టి మక్తల్ మున్సిపల్ అధికారులు ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి, స్కూల్ పరిసరాల్లో వీధి కుక్కల బెడదను వెంటనే నియంత్రించి విద్యార్థులు, ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL