Nagarkurnool: ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయం, పరిహారం అందించాలి: ఎంపీ!

Nagarkurnool: స్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అధికారులు వేగంగా దర్యాప్తు చేపట్టి, బాధితులకు సకాలంలో పరిహారం, పునరావాసం కల్పించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆదేశించారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 16 July 2026 9:09 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయం, పరిహారం అందించాలి: ఎంపీ!

నాగర్ కర్నూల్: ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రత, సామాజిక న్యాయం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అధికారులు వేగంగా దర్యాప్తు చేపట్టి, బాధితులకు సకాలంలో పరిహారం, పునరావాసం కల్పించాలని ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీలపై జరిగే అఘాయిత్యాల కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఎంపీ స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో పౌర హక్కుల పరిరక్షణ చట్టం (PCR), ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద నమోదైన కేసులపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు.

కేసుల ఎఫ్‌ఐఆర్‌లు, దర్యాప్తు పురోగతి, చార్జిషీట్లు, అరెస్టులు, కోర్టు విచారణలు, పరిహారం, పునరావాస చర్యలపై అధికారులు వివరాలు అందించారు. కేసుల దర్యాప్తులో జాప్యాన్ని నివారించి, నిబంధనల ప్రకారం విచారణ పూర్తికాకముందే బాధితులకు పరిహారం, న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ మల్లు రవి సూచించారు.

జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో నమోదైన ప్రతి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. బాధితులకు పరిహారం, పునరావాసం, సంక్షేమ పథకాలు అందేలా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ అట్రాసిటీ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి వేగవంతమైన, పారదర్శక దర్యాప్తు చేపడుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా అట్రాసిటీ కేసులపై త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి పరిష్కరించాలని కోరారు. కొన్ని కేసుల్లో పరిహారం, దర్యాప్తులో జాప్యం ఉందని కమిటీ సభ్యులు ప్రస్తావించి, పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ అరుణ రెడ్డి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఉమాపతి, డీఎస్పీలు, ఆర్డీవోలు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

Next Story