Makthal: తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తాం.. హరీశ్ రావుకు మంత్రి సవాల్!
Makthal: తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
Makthal: తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తాం.. హరీశ్ రావుకు మంత్రి సవాల్!
Makthal: డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిస్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడల నేపథ్యంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ స్కూల్లో నూతనంగా నిర్మిస్తున్న నిర్మాణాలు , క్రీడాకారుల కోసం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
క్రీడాకారులతో మాట్లాడి వారికి అందుతున్న వసతులు, శిక్షణ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. మెన్స్ జిమ్నాస్టిక్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారుల ప్రతిభను పరిశీలించి వారిని ప్రోత్సహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశం రాష్ట్రానికి రావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఖేలో ఇండియా క్రీడలను అందరూ సమష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఖేలో ఇండియా క్రీడల నిర్వహణతో పాటు రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం 203 కోట్లు కేటాయించిందని తెలిపారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి తగిన శిక్షణ, ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామని వివరించారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అత్యాధునిక సౌకర్యాలతో స్టేడియం నిర్మించనున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని తెలిపారు. క్రీడల సమయంలో గాయపడే క్రీడాకారులకు మెరుగైన వైద్యం అందించేందుకు అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రిని సైతం నిర్మిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఖేలో ఇండియా క్రీడల్లో పాల్గొనేందుకు దేశంలోని 28 రాష్ట్రాల నుంచి దాదాపు 7 వేల మంది క్రీడాకారులు తెలంగాణకు రానున్నారని, వారికి అవసరమైన అన్ని వసతులు కల్పించామని చెప్పారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ తన ప్రతిభతో దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని మంత్రి గుర్తుచేశారు. భారతీయ సంప్రదాయ క్రీడ అయిన కర్రసామును కూడా ఖేలో ఇండియాలో చేర్చడం సంతోషకరమన్నారు.
ఖేలో ఇండియా కోసం చేపడుతున్న నిర్మాణాలన్నీ శాశ్వత ప్రాతిపదికన, నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ క్రీడల నిర్వహణ పూర్తయిన తర్వాత కూడా రాష్ట్ర క్రీడాకారులకు ఉపయోగపడేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించిందని మంత్రి విమర్శించారు. తాము క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు రాణించేలా చర్యలు తీసుకుంటుంటే విమర్శలు చేయడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం క్రీడలకు ఎంత బడ్జెట్ కేటాయించింది? తమ ప్రభుత్వం ఎంత కేటాయించింది? అనే అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
క్రీడాకారులకు మెరుగైన భవిష్యత్తు కల్పించడం, గ్రామీణ ప్రతిభను ప్రపంచ వేదికపై నిలబెట్టడం, తెలంగాణను క్రీడారంగంలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.




