Makthal: మక్తల్ మండలంలోని 39 గ్రామాలపై మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక సమీక్ష!
Makthal: మక్తల్ మండలంలోని 39 గ్రామాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన మంత్రి వాకిటి శ్రీహరి, రూ.2,200 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
Makthal: మక్తల్ మండలంలోని 39 గ్రామాలపై మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక సమీక్ష!
Makthal: మక్తల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి.. ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందాలి. ఏ గ్రామం కూడా అభివృద్ధికి దూరంగా ఉండకూడదనే లక్ష్యంతో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ముందుకు సాగుతున్నారు.
ఇందులో భాగంగా బుధవారం మక్తల్ క్యాంపు కార్యాలయంలో మక్తల్ మండలంలోని 39 గ్రామాల సర్పంచులు, ముఖ్య నాయకులతో గ్రామాల వారీగా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ప్రతి గ్రామానికి 20 నుంచి 30 నిమిషాల సమయం కేటాయించి, అక్కడి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల అవసరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నాయకులు చెప్పిన సమస్యలను నోట్ చేసుకుంటూ వాటి పరిష్కారానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాలు అంటే కేవలం విమర్శలు చేయడం కాదని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడమే ముఖ్యమని అన్నారు. విషయం తెలిసిన వారు కూడా నోరు మెదపకుండా ఉంటే అన్యాయం రాజ్యమేలుతుందని, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని సూచించారు.
2,200 కోట్లతో అభివృద్ధి పనులు
మక్తల్ నియోజకవర్గంలో దాదాపు రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. రహదారుల అభివృద్ధికి రూ.500 కోట్లు, మక్తల్–నారాయణపేట నాలుగు లేన్ల రహదారికి రూ.237 కోట్లు మంజూరై టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మక్తల్లో రూ.80 కోట్లతో నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రిని సంక్రాంతి లోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
అలాగే రూ.26 కోట్లతో ఆధునిక క్రీడా స్టేడియం, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, పలు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.
విద్య, వైద్యం, పునరావాసానికి ప్రత్యేక ప్రాధాన్యత
మక్తల్లో డిగ్రీ కళాశాల అందుబాటులోకి రావడంతో స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశం కలిగిందని మంత్రి తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు నియోజకవర్గానికి చెందిన 64 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు.
భూత్పూర్ రిజర్వాయర్ కారణంగా భూములు కోల్పోయిన గ్రామాలకు ఆధునిక సౌకర్యాలతో పునరావాస గ్రామాలు నిర్మిస్తున్నామని, అనుగొండకు రూ.50 కోట్లు, అంకెన్పల్లికి రూ.28 కోట్లు, దాదన్పల్లికి రూ.30 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
విమర్శలకు వాస్తవాలతో సమాధానం చెప్పాలి
అభివృద్ధి పనులపై విమర్శలు చేసే ముందు వాటి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని మంత్రి సూచించారు. మక్తల్–నారాయణపేట నాలుగు లేన్ల రహదారికి నిధులు మంజూరై, టెండర్లు పూర్తయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడంపై స్పందిస్తూ, ప్రజలకు వాస్తవాలు వివరించాలని అన్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కంటే నియోజకవర్గ సమష్టి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నేను బాగుంటే సరిపోదు మనమంతా బాగుండాలి. అప్పుడే మన ప్రాంతం బాగుంటుంది. నేను పుట్టిన గడ్డకు మేలు చేయాలన్నదే నా సంకల్పం" అని మంత్రి స్పష్టం చేశారు.
కేవలం హామీలకే పరిమితం కాకుండా గ్రామాల వారీగా సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడం ద్వారా మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.




