Makthal: మక్తల్‌లో అంతర్జాతీయ స్థాయి స్టేడియం.. మంత్రి ప్రకటన!
Makthal: నారాయణపేట జిల్లా మక్తల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి మినిస్టర్ కప్ 2026-27 క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
Makthal: మక్తల్‌లో అంతర్జాతీయ స్థాయి స్టేడియం.. మంత్రి ప్రకటన!
Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ లో క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.
మక్తల్ పట్టణంలో నిర్వహిస్తున్న మినిస్టర్ కప్ 2026-27 సీజన్-1 క్రికెట్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ పోటీల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితమే దేశంలోని నలుమూలల నుంచి క్రీడాకారులు మక్తల్‌కు వచ్చి క్రికెట్ ఆడేవారని, క్రీడలకు మక్తల్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపును మరింత పెంచేలా కృషి చేస్తున్నామని తెలిపారు. మక్తల్‌లో 25 కోట్ల వ్యయంతో ఆధునాతన స్టేడియం నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికగా మక్తల్ స్టేడియాన్ని తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలోని ప్రతి మండలంలో క్రీడా మైదానాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించామని తెలిపారు.గ్రామీణ స్థాయిలోనే క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.
క్రీడాకారులు ఇతర విషయాలపై దృష్టి మళ్లించకుండా ఆటపై పూర్తిస్థాయిలో ఏకాగ్రత పెట్టి ప్రతిభను నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు.
క్రీడాకారులకు ప్రతిభతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన చికితరావు వంటి క్రీడాకారిణులు ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి తమ పట్టుదలతో విజయాలు సాధించడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించడం ఆమె కృషికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లను 5 శాతానికి పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగం అభివృద్ధి కోసం 600 కోట్లు కేటాయించిందని, ఈ నిధులతో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, స్టేడియంల నిర్మాణం, శిక్షణ సౌకర్యాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని వివరించారు.
తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలను నిర్వహించే అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రానికి ఈ అవకాశాన్ని తీసుకురావడంలో కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
క్రీడలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా యువతలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందించే గొప్ప వేదికలని మంత్రి అన్నారు. మక్తల్‌లో ప్రారంభించిన ఈ క్రికెట్ పోటీలు భవిష్యత్తులో మరెందరో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.




