Nagarkurnool: అచ్చంపేట కేజీబీవీని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 10 Nov 2026 12:22 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: అచ్చంపేట కేజీబీవీని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్!

Nagarkurnool: కేజీబీవీల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశించారు. విద్యార్థినులకు మెరుగైన విద్యా ప్రమాణాలు, సౌకర్యవంతమైన వసతి, నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వారి విద్యా ప్రగతికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.

మంగళవారం అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన, భోజన ఏర్పాట్లు, ఇంటర్మీడియట్ కోర్సుల నిర్వహణ, విద్యార్థుల ప్రవేశాల నమోదు తదితర అంశాలను పాఠశాల పరిసరాలను పరిశీలించి పాఠశాల ప్రత్యేక అధికారిని కుసుమ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కేజీబీవీ పాఠశాల ఆవరణను పరిశీలించిన కలెక్టర్, పాఠశాల చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ గోడ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భద్రత దృష్ట్యా ప్రహరీ గోడ నిర్మాణం ఎంతో ముఖ్యమని, నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత సమయంలోగా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

పాఠశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ కోర్సులు, విద్యార్థినుల ప్రవేశాల వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు.

160 మంది విద్యార్థులకు గాను 95 మంది విద్యార్థులు ఉన్నారని తెలుపగా, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు 100 శాతం నమోదయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పాఠశాల ప్రత్యేక అధికారి కుసుమ ను కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాంకేతిక విద్యకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులో నల్లమల్ల అటవీ ప్రాంతంలోని విద్యార్థినిలకు ఏఐ ఆధారిత విద్యను అందించేలా విద్యార్థినుల ప్రవేశాలు మరింత పెరిగేలా విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఈ కోర్సు ద్వారా విద్యార్థినులకు భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశాలను వివరించి, వారిని ప్రోత్సహించాలని సూచించారు.

పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులు తెలుగు సబ్జెక్టులో రాస్తున్న స్లిప్ టెస్టును జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థినుల వద్దకు వెళ్లి పరీక్ష రాస్తున్న తీరును, ప్రశ్నలకు సమాధానాలు రాసే విధానాన్ని పరిశీలించారు. విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా విద్యార్థినులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు ప్రతి విద్యార్థినిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

విద్యార్థినులకు పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తూ, చదువులో వెనుకబడిన వారిని గుర్తించి అదనపు బోధన అందించాలని సూచించారు. కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, విషయ పరిజ్ఞానం పెంపొందించుకునేలా బోధన సాగాలని కలెక్టర్ సూచించారు.

విద్యార్థినులకు అందిస్తున్న భోజన సౌకర్యాలపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థినుల ఆరోగ్యం, పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన, పౌష్టిక విలువలతో కూడిన భోజనం అందించాలని సూచించారు. వంటశాల, భోజనశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర వసతుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు.

పాఠశాలలో విద్యార్థినులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునేలా చర్యలు తీసుకోవాలని, వసతి గృహంలో పరిశుభ్రత, భద్రత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. విద్యార్థినుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.

ఇంటర్మీడియట్ విద్యార్థినులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మించాల్సిన అవసరం ఉందని, క్రీడా ప్రాంగణాన్ని కూడా అభివృద్ధి చేయాలని పాఠశాల ప్రత్యేక అధికారి కుసుమ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్, అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల సంఖ్య, తరగతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా తగిన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అదేవిధంగా అవసరమైన మరుగుదొడ్ల సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాలని తెలిపారు.

పాఠశాల ఆవరణలో ఉన్న క్రీడా మైదానాన్ని పరిశీలించిన కలెక్టర్, గ్రౌండ్‌ను పూర్తిస్థాయిలో లెవలింగ్ చేసి విద్యార్థినులకు అనువైన ఆటస్థలంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహించాలని, శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.

ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కేజీబీవీలో విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థినుల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ వెంట నడింపల్లి గ్రామ సర్పంచ్ గోపి పద్మ, మండల విద్యాధికారి శ్రీనివాస మూర్తి, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA