Nagarkurnool: బాలల ప్రజావాణికి విశేష స్పందన
Nagarkurnool: నాగర్‌కర్నూల్ కలెక్టరేట్లో నిర్వహించిన బాలల ప్రజావాణిలో విద్యార్థుల సమస్యలపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తక్షణమే స్పందించి అధికారులను ఆదేశించారు.
Nagarkurnool: బాలల ప్రజావాణికి విశేష స్పందన
నాగర్‌కర్నూల్: బాలల హక్కుల వారోత్సవాన్ని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రజావాణి మందిరంలో సోమవారం ప్రత్యేకంగా నిర్వహించిన బాలల ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు విద్య, వైద్యం, రవాణా తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌కు వివరించి వినతిపత్రాలు సమర్పించారు.
మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మిషన్ వాత్సల్య, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే సాధారణ ప్రజావాణితో పాటు ప్రత్యేకంగా బాలల ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా బల్మూరు, తిమ్మాజీపేట, బిజినపల్లి, తాడూరు మండలాలకు చెందిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. పండుగలు, ఇతర సెలవు రోజుల్లో పాఠశాలల నుంచి స్వగ్రామాలకు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమ ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సెలవుల సమయంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు, తిరిగి పాఠశాలలకు చేరుకునేందుకు అనువుగా బస్సు సౌకర్యాలు కల్పించాలని కోరారు. విద్యార్థినుల విజ్ఞప్తిని పరిశీలించి ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు.
అదేవిధంగా తండ్రిని కోల్పోయిన ముగ్గురు బాలికలు తమ కుటుంబ పరిస్థితులను కలెక్టర్‌కు వివరించి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు ఆటంకం కలగకుండా ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వపరంగా అవకాశం, అవసరమైన సహకారం కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. వారి పరిస్థితిని పరిశీలించి, విద్యాభ్యాసం కొనసాగించేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర సహాయ అవకాశాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
మరో వినతిలో ఆరు నెలల పసిపాపకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చిన్నారి తల్లి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ నాగర్‌కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. చిన్నారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్య సేవలు అందించేలా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వ పరంగా భరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థులు సమర్పించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల స్వభావాన్ని బట్టి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలోని బాలబాలికలు తమకు ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత పాఠశాలలు ,గురుకుల ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయులకు వినతిపత్రాలను అందజేయాలని, సమస్యల పరిష్కారానికి వచ్చిన వినతి పత్రాలను జిల్లా యంత్రాంగానికి సమర్పించి, పరిష్కారానికి సంబంధిత శాఖల చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ తెలిపారు.
, సీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణి, మండల ప్రజావాణి కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారంపై ఎంతో నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమాలకు వచ్చి అర్జీలు సమర్పిస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
సీఎం ప్రజావాణి నుంచి మండల స్థాయి ప్రజావాణి వరకు అందిన ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యతనిస్తూ, బాధితులకు సంతృప్తికరమైన పరిష్కారం అందించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా రెవెన్యూ అధికారి పాండు, కలెక్టరేట్ పరిపాలన అ ధికారి చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




