Nagarkurnool: ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలి

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని, నూతన ఇసుక రీచ్‌లకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 12 Nov 2026 9:34 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలి

నాగర్ కర్నూల్: జిల్లాలో కంకర, ఇసుక లభ్యతను పెంపొందించడంతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ఉచితంగా సరఫరా చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

గురువారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధ్యక్షతన జిల్లాస్థాయి ప్రీ యాక్షన్ కమిటీ, జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో జిల్లాలో కంకర తవ్వకాలకు గుర్తించిన ప్రాంతాలు, నూతనంగా గుర్తించిన ఇసుక రీచ్‌లు, వాటికి మంజూరు చేయాల్సిన అనుమతులు, ఇసుక సరఫరాకు చేపట్టాల్సిన చర్యలపై అదనపు కలెక్టర్ బి చేన్నయ్య, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా లతో కలిసి రెవిన్యూ , మైనింగ్ వ్యవసాయ , భూగర్భ జల సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…….. నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని తెలకపల్లి, నాగర్ కర్నూల్ మండలాల్లో కంకర తవ్వకాల కోసం గుర్తించిన రెండు గ్రామాల్లో సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆయా ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. కంకర తవ్వకాలకు అనువైన పరిస్థితులు, ప్రభుత్వ నిబంధనలు, అవసరమైన అనుమతులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తదుపరి ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

అదేవిధంగా వంగూరు మండలం జాజాల గ్రామ పరిధిలో నూతనంగా గుర్తించిన ఇసుక రీచ్‌లకు అవసరమైన అనుమతులు మంజూరు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

జాజాల గ్రామంలో గుర్తించిన ఇసుక రీచ్‌ల నుంచి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ పనుల్లో ఇసుక కొరత తలెత్తకుండా చూడాలని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉచిత ఇసుక అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇసుక రీచ్‌ల అనుమతులు, కంకర తవ్వకాలకు సంబంధించిన ఏర్పాట్లు, ఇసుక సరఫరా విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేసి, ప్రజలకు, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు అవసరమైన నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎడి మైనింగ్ హరికృష్ణ, పిడి హౌసింగ్ గోపాల్ నాయక్, భూగర్భ జల అధికారిని దివ్య జ్యోతి, ఆర్డీవోలు అర్చన బన్సీలాల్ జనార్దన్ రెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL