Nagarkurnool: జాతీయ దంత వైద్య విద్యా బోర్డు సభ్యుడిగా డా. రాజేష్ రెడ్డి!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జాతీయ దంత వైద్య కమిషన్ (NDC) పరిధిలోని UG, PG ఎడ్యుకేషన్ బోర్డు పార్ట్‌టైమ్ సభ్యుడిగా నియమితులయ్యారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 4 Nov 2026 8:43 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: జాతీయ దంత వైద్య విద్యా బోర్డు సభ్యుడిగా డా. రాజేష్ రెడ్డి!

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ అధ్యక్షుడు డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి జాతీయ స్థాయిలో మరో కీలక బాధ్యత లభించింది. భారత ప్రభుత్వ జాతీయ దంత వైద్య కమిషన్ (NDC) పరిధిలోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డెంటల్ ఎడ్యుకేషన్ బోర్డు పార్ట్‌టైమ్ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. దంత వైద్య విద్యా రంగంలో ఆయన సేవలకు ఈ నియామకం గుర్తింపుగా నిలిచింది.

జాతీయ దంత వైద్య కమిషన్, దాని మూడు స్వయంప్రతిపత్తి బోర్డులకు పార్ట్‌టైమ్ సభ్యుల ఎంపిక ప్రక్రియను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నవంబర్ 3న జాతీయ దంత వైద్య కమిషన్ చట్టం-2023 ప్రకారం నిర్వహించింది. ఈ ప్రక్రియలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల తరఫున 10 మంది, రాష్ట్ర డెంటల్ కౌన్సిళ్ల తరఫున తొమ్మిది మంది సభ్యులను రెండేళ్ల పదవీకాలానికి ఎంపిక చేశారు. ఇప్పటికే జాతీయ దంత వైద్య కమిషన్ సభ్యుడిగా కొనసాగుతున్న డా. రాజేష్ రెడ్డికి తాజాగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డెంటల్ ఎడ్యుకేషన్ బోర్డులో అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా ఎంఎల్ఏ డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తూ దేశవ్యాప్తంగా దంత వైద్య విద్యా ప్రమాణాల పెంపు, పాఠ్యప్రణాళిక రూపకల్పన, విద్యా విధానాల అభివృద్ధి, దంత వైద్య కళాశాలల నాణ్యత మెరుగుదలకు కృషి చేస్తానని తెలిపారు. ఆయన నియామకంపై పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అభిమానులు అభినందనలు తెలిపారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL