Nagarkurnool: కేఎల్ఐ ఆయకట్టుకు నీరివ్వకుంటే ఉద్యమం తప్పదు నాగం జనార్దన్ రెడ్డి

Nagarkurnool: కేఎల్ఐ కాలువల నిర్మాణం, రూ.1000 కోట్ల నిధుల విడుదల మరియు సాగునీటి సమస్యలపై రైతులతో కలిపి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 26 Aug 2026 8:26 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: కేఎల్ఐ ఆయకట్టుకు నీరివ్వకుంటే ఉద్యమం తప్పదు నాగం జనార్దన్ రెడ్డి

నాగర్‌కర్నూల్: రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాలో ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకు నిధులు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు.

తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో తాను ఏ విధంగా ప్రజలను చైతన్యపరిచానో అదే విధంగా రైతులను చైతన్యపరిచేందుకు సిద్ధమవుతున్నానని నాగం తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానాలు చేసిన వారి ఆశయాలను నిర్వీర్యం చేయవద్దని, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నార్లాపూర్ వద్ద ప్రారంభించడం వల్ల కేఎల్‌ఐకి ఇబ్బందులు ఏర్పడతాయని గతంలో లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీనివల్ల కేఎల్‌ఐలోని ఐదు మోటార్లు దెబ్బతిన్నాయని, ఏళ్లు గడుస్తున్నా వాటిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రస్తుతం రెండు మోటార్లు మాత్రమే పనిచేస్తుండటంతో రైతుల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదని పేర్కొన్నారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఐదు మోటార్లు పూర్తిస్థాయిలో పనిచేసి ఉంటే ప్రతిరోజూ రెండు టీఎంసీల నీటిని 40 రోజుల పాటు వినియోగించుకుని ఐదు రిజర్వాయర్లను నింపి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉండేదని నాగం వివరించారు. రైతులను సమీకరించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని, ఉద్యమాల ద్వారానే రైతుల ఆయకట్టుకు నీరు అందేలా పోరాడతానని అన్నారు.

కాలువల సామర్థ్యాన్ని తగ్గించడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందని, నార్లాపూర్ నుంచి అండర్‌గ్రౌండ్ పనులకు అనుమతులు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1,000 కోట్లను వెంటనే విడుదల చేసి కేఎల్‌ఐ డిస్ట్రిబ్యూటరీ కాలువలను నిర్మించాలని డిమాండ్ చేశారు. వట్టెం రిజర్వాయర్ ద్వారా డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఏదుల నుంచి నీటిని తరలించేందుకు నిధులు మంజూరు చేశారని ఆరోపించారు.

సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారణంగా నల్గొండ జిల్లాకు నీటిని తరలించేందుకు రూ.1,800 కోట్ల నిధులు మంజూరు చేశారని, మరి ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని నాగం ప్రశ్నించారు. రాజకీయాల్లో స్వార్థం, అక్రమార్జన పెరిగిపోయాయని విమర్శించారు.

విద్యుత్ అంతరాయాలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమస్యలు ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. మద్యం విక్రయాల ద్వారా ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వం విద్యారంగానికి మాత్రం తగినన్ని నిధులు కేటాయించడం లేదని విమర్శించారు.

ప్రజలకు అండగా నిలిచేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. యువత చేపట్టే ఉద్యమాలను అణిచివేసేందుకు దాడులు చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమాలే మార్గమని పేర్కొంటూ వ్యవస్థల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో యువ నేత నాగం శశిధర్ రెడ్డి, నాయకులు అర్థం రవి, బాలగౌడ్, అర్జునయ్య, భీముడు, సత్యం, అహ్మద్, డిష్ రాజు, దామోదర్, విష్ణుచారి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

Next Story