Nagarkurnool: సగరులను బీసీ-ఏలోకి చేర్చాలని కలెక్టరేట్ ఎదుట నిరసన

Nagarkurnool: నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ఎదుట సగర సంఘం ఆధ్వర్యంలో సగరులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని కోరుతూ సోమవారం నిరసన తెలిపారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 16 Nov 2026 9:32 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: సగరులను బీసీ-ఏలోకి చేర్చాలని కలెక్టరేట్ ఎదుట నిరసన

నాగర్‌కర్నూల్: సగరులను బిసి-డి నుంచి బీసీఏలోకి చేర్చాలని జిల్లా కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు సగర సంగమం ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా శారీరక శ్రమను మాత్రమే నమ్ముకొని, నాగరిక సమాజానికి జలాశయాలను, బావులను, చెరువు కట్టలను, భవన పునాదులను నిర్మించి అందించిన అత్యంత నిస్సహాయ శ్రామిక జాతి సగర జాతి అని అన్నారు.

రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల పైగా ఉన్నటువంటి మా సమాజం ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, ఆర్థిక వెనుకబాటును ఎదుర్కొంటుంది. 1970 వ సంవత్సరంలో అనంతరామన్ కమిషన్ నాటి సమగ్ర విశ్లేషణ లోపించడం వల్ల సగరులను బీసీడీలో చేర్చడం జరిగింది.

అయితే నేటి వాస్తవ పరిస్థితుల్లో బీసీ డీలో ఉన్న భూస్వామ్య, విద్యావంతులైన, వ్యాపార, రాజకీయ ఆధిపత్యం కలిగిన కులాలతో మా శ్రామిక సగరబిడ్డలు ఏమాత్రం పోటీ పడలేక విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్నారు. ఈ చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికి రాజ్యాంగంలోని 14, 15 (4), 16(4) 38, 46 అధికరణ స్ఫూర్తితో సగర కులాన్ని బీసీ డీ నుంచి తొలగించి బీసీ ఏ గ్రూపులోకి మార్చుటకు ప్రభుత్వానికి సానుకూల నివేదిక పంపాలని కోరుచున్నాము.

సగర సమాజం చారిత్రక, పౌరాణిక నేపథ్యం కలిగిన ఘనమైన జాతి, పవిత్ర గంగానదిని భూమికి రప్పించిన శ్రమజీవుల చక్రవర్తి శ్రీ భగీరథ మహారాజు వంశీయులు గా మేము గర్విస్తున్నాం. ఇలాంటి సందర్భంలో బావులు తవ్వడం, కాలువలు నిర్మించడం, మట్టి పనులు చేయడం, ఉప్పు తయారు చేయడం మా కులవృత్తిని నమ్ముకొని ఇన్నాళ్లు జీవనాన్ని కొనసాగిస్తున్నాం.

ఇలాంటి సందర్భంలో ప్రస్తుతము ఉన్నటువంటి ప్రభుత్వం మా యొక్క జీవన విధానాన్ని గుర్తించి బిసి ఏలూరు చేర్చాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. కార్యక్రమంలో సగర సంగం జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లం రాములు, రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి, పట్టణ అధ్యక్షుడు కొమ్ములబాలయ్య, తాలూకా అధ్యక్షుడు చిలుక పర్వతాలు, జిల్లా కన్వీనర్ మొల్ల తిరుపతయ్య, కొమ్ముల శ్రీనివాసులు, కె. వెంకటయ్య, జి. తిరుపతయ్య, సగర సంగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL